మెరుగైన వైద్యం మిథ్యే! | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్యం మిథ్యే!

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

● వైద్యసేవల్లో లోపాలను సరిదిద్దుకోని అధికారులు ● మారుమూల ఏజెన్సీగా గుండాల మండలం ● సకాలంలో, సరైన వైద్యం అందక ఇటీవల గర్భిణి మృతి ● ఇల్లెందు, మణుగూరుల్లో ఐసీయూ సేవలు నిల్‌

● వైద్యసేవల్లో లోపాలను సరిదిద్దుకోని అధికారులు ● మారుమూల ఏజెన్సీగా గుండాల మండలం ● సకాలంలో, సరైన వైద్యం అందక ఇటీవల గర్భిణి మృతి ● ఇల్లెందు, మణుగూరుల్లో ఐసీయూ సేవలు నిల్‌

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మెరుగైన వైద్య సేవలు అందకపోవడంతో గుండాల మండలంలో గర్భిణి మృతి చెందడం రాష్ట్రం వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల్లోని లోపాలను ఈ ఘటన ఎత్తిచూపుతోంది.

సకాలంలో ఆస్పత్రికి చేర్చే సౌకర్యం లేక...

గతేడాది నవంబర్‌లో చర్ల సామాజిక ఆరోగ్య కేంద్రంలో నెలలు నిండకుండానే ఇద్దరు కవలలకు తల్లి జన్మనిచ్చింది. పిల్లలిద్దరు 600 గ్రాముల బరువే ఉండటంతో పరిస్థితి విషమంగా మారింది. అప్రమత్తమైన వైద్యులు తల్లి, బిడ్డలను ప్రసవం జరిగిన తక్షణమే అంబులెన్స్‌లో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. అక్కడ, పెద్దలకు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ), పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉండటం వల్ల తక్షణమే వైద్య సాయం అందింది. రెండు నెలల చికిత్స అనంతరం తల్లీబిడ్డలు ఆస్పత్రి నుంచి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నారు. గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇద్దరు వైద్యుల్లో ఒక్కరే అందుబాటులో ఉన్నారు. సకాలంలో అంబులెన్స్‌, 108 లేకపోవడంతో గోల్డెన్‌ అవర్‌లో ఇల్లెందు ఏరియా ఆస్పత్రికి తరలించలేదు. ఎట్టకేలకు ఇల్లెందుకు చేరుకున్నా, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ అందుబాటులో లేకపోవడం బాధితురాలి పాలిట శాపంగా మారింది. చివరకు అన్ని సౌకర్యాలు ఉన్న ఖమ్మం పెద్దాస్పత్రికి బాధితురాలిని చేర్చేసరికి పరిస్థితి చేయిదాటి పోయింది.

ఏజెన్సీలో అదనపు అంబులెన్సులు అవసరం

ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు తక్షణమే బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మండలం యూనిట్‌గా 108 సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఏజెన్సీలో ఉండే దూరాన్ని పరిగణనలోకి తీసుకుని అదనపు 108 వాహనాలు, అంబులెన్సులు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. గుండాల మండలాన్నే పరిశీలిస్తే కొత్తగూడెం, మణుగూరులు 80 నుంచి 100 కి.మీ దూరంలో, ఇల్లెందు, నర్సంపేటలు 60 కి.మీ దూరంలో ఉన్నాయి. ప్రయాణ సమయం ఎక్కువగా ఉండటంతో గోల్డెన్‌ అవర్‌లో అందాల్సిన వైద్యసాయం దక్కడం లేదు. ఇల్లెందు–గుండాల మధ్య కొమురారం, పోలారం, కాచనపల్లి గ్రామాల్లోని పీహెచ్‌సీ/సబ్‌సెంటర్‌లలో ఒకదాన్ని అప్‌గ్రేడ్‌ చేసి, అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

గుండాల ఆస్పత్రిని సీహెచ్‌సీగా మార్చాలి

జిల్లాకు చిట్టచివరన గుండాల మండలం ఉంది. మండల కేంద్రం నుంచి నలువైపులా కనీసం 60 కి.మీ దూరం ప్రయాణిస్తేనే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. గతంలో ఇదే తరహా పరిస్థితులు చర్ల, అశ్వారావుపేట మండలాల్లోనూ ఉండేవి. అక్కడ ఆస్పత్రులను అప్‌గ్రేడ్‌ చేసి, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. ఫలితంగా ఆ ప్రాంత ఏజెన్సీ ప్రజల కష్టాలు తీరాయి. తాజా ఘటనను దృష్టిలో ఉంచుకునైనా గుండాల ఆస్పత్రిని సీహెచ్‌సీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేయడం, తక్షణ అవసరంగా కనీసం సీమాంక్‌ సెంటర్‌ను మంజూరు చేయించడంపై ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుండాల తరహా పరిస్థితులు ఉన్న ఇతర మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలపైనా దృష్టి పెట్టాలని జిల్లా వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

భద్రాచలంలోనే ఐసీయూ సేవలు

ఉన్నత స్థాయిలో వైద్య సేవలు అందివ్వడంలో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లది కీలక పాత్ర. కానీ జిల్లాలో కేవలం భద్రాచలంలోనే 10 పడకల సామర్థ్యంతో ఐసీయూ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఏజెన్సీ కేంద్రాలుగా ఉన్న ఇల్లెందు, మణుగూరు ఏరియా ఆస్పత్రుల్లో ఐసీయూ సేవలు అందుబాటులో లేవు. ఇక్కడికి అత్యవసర వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులను ఆగమేఘాల మీద భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం రిఫర్‌ చేయాల్సి వస్తోంది. జిల్లా నుంచి ఐసీయూ ప్రతిపాదనలు వెళ్లిన ప్రతీసారి కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ట్రామా కేర్‌ సెంటర్‌ను రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. మూడేళ్లు దాటినా ట్రామా కేర్‌ సెంటర్‌ అందుబాటులోకి రాలేదు. దీంతో జిల్లా మొత్తానికి భద్రాచలం ఒక్కటే ఎస్టాబ్లిష్డ్‌ ఐసీయూ సెంటర్‌గా ఉంది. లేదంటే అత్యవసర వైద్య సేవలకు ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి.

గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement