సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు భూసార పరీక్ష చేయించుకొని, దాని ఆధారంగా పంటలకు సరిపడే మోతాదులోనే ఎరువుల వినియోగాన్ని చేపట్టాలని కొత్తగూడెం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ సూచించారు. శనివారం కేవీకేలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతుల ఖాతాల్లో జమ అవుతున్న డబ్బులను విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వ్యవసాయ పను ల కోసం వినియోగించుకోవాలని సూచించారు. మోతాదుకు మించి ఎరువులు వాడితే భూసారం తగ్గుతుందన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వరి రకాలు వేసుకోవాలని, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలు డబ్ల్యూజీఎల్ 44 (సిద్ధి), కేఎన్‌ఎం1638 రకాలు వేసుకోవాలని సూచించారు. అనంతరం ఉద్యాన శాస్త్రవేత్త శివ మాట్లాడుతూ.. రైతుల కోసం కేవీకే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. పంట మార్పిడి విధానాన్ని అవలంబించి, ఆయిల్‌పామ్, మునగ, తీగజాతి కూరగాయల సాగు చేపట్టడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని వివరించారు. కార్యక్రమంలో కోరామాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆగ్రోనమిస్ట్ వెంకటేశ్, మార్కెటింగ్ ఆఫీసర్ రాజేశ్, 80 మంది రైతులు పాల్గొన్నారు. కాగా, రైతులకు కేఎన్‌ఎం–1638 విత్తనాలు పంపిణీ చేశారు.
కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ భరత్


