మొక్కల సంరక్షణపై శద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కల సంరక్షణపై శద్ధ చూపాలి

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

పాల్వంచరూరల్‌: గ్రామ పంచాయతీలోని నర్సరీల్లోని మొక్కలు చనిపోకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఆర్‌డీఓ విద్యాచందన సిబ్బందికి సూచించారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి, బస్వతారకకాలనీ, కేశవాపురం, జగన్నాథపురం, సోములగూడెం, బిక్కుతండా గ్రామపంచాయతీలోని నర్సరీలను ఆమె సందర్శించి పరిశీలించారు. మొక్కల పెంపకం, నిర్వహణ, నీటి సరఫరాపై ఆరా తీశారు. నర్సరీల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని, మొక్కలు నాటిన తర్వాత ప్రతి మొక్క సజీవంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారిణి షాబ్నా, ఏపీఓ రఘుపతి, ఈసీ పుల్లయ్య పాల్గొన్నారు.

ఘనంగా వీకెండ్‌

సాంస్కృతిక వేడుకలు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం హరిత హోటల్‌ లో తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వీకెండ్‌ కల్చరల్‌ కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం హైదరాబాద్‌ కళాకారులు నిర్వహించిన సంగీత కచేరి ప్రేక్షకులను అలరించింది. పర్యాటకులకు వినోదం పంచేందుకు ప్రతి శని, ఆదివారాల్లో ఇలాంటి సాంస్కృతిక వేడుకలను నిర్వహించనున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

చుంచుపల్లి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని పబ్లిక్‌ హెల్త్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవీందర్‌ నాయక్‌ ఆదేశించారు. శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతి, మాతా,శిశు ఆరోగ్య సేవలు, కుటుంబ నియంత్రణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలు, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌, టీకా కార్యక్రమం, ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల పనితీరు, సికిల్‌ సెల్‌ అనీమియా నియంత్రణ కార్యక్రమం, క్షయవ్యాధి నిర్మూలన, కుష్ఠు నిర్మూలన, వెక్టర్‌ బోర్న్‌ వ్యాధుల నివారణ తదితర అంశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షించాలన్నారు. హైరిస్క్‌ గర్భిణులను ముందస్తుగా గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో రిఫరల్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలుచేయాలని సూచించారు. సిబ్బంది ప్రతాప్‌, ప్రసాద్‌, దినేష్‌, మోహన్‌, రామ్‌ ప్రసాద్‌, విప్లవ్‌ కుమార్‌, సలిత, శ్రీధర్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

‘రెట్రో రిఫ్లెక్టివ్‌ టేప్‌’ను

రద్దు చేయాలి

కొత్తగూడెంఅర్బన్‌: రెట్రో రిఫ్లెక్టివ్‌ టేప్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కంచర్ల జమలయ్య డిమాండ్‌ చేశారు. కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ రిఫ్లెక్టివ్‌ టేపుల కంటే రెట్టింపు ధరలతో ఈ టేపులను విక్రయిస్తుడటంతో ఆటో డ్రైవర్లపై ఆర్థికభారం పడుతోందన్నారు. వాహనం చుట్టూ 22 మీటర్ల నుంచి 26 మీటర్ల వరకు టేపులను అతికించాలనే కొత్త నిబంధనతో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్‌లు, లారీలు, బస్సుల యజమానులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేకపోయినా రవాణా శాఖ తీరు ప్రైవేట్‌ కంపెనీల దోపిడీకి ఊతమిచ్చేలా ఉందని అన్నారు. ఓ ప్రైవేట్‌ కంపెనీకి లాభం చేకూర్చడం కోసమే ఈ విధానం అమలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి మర్రి కృష్ణ, చింటూ, సురేష్‌, మోహన్‌, శీను, సోను, స్వామి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement