ఇల్లెందురూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చుకునేలా కార్యదర్శులు పనితీరు మార్చుకోవాలని జెడ్పీ సీఈఓ బొగ్గుల నాగలక్ష్మి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహిచారు. సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు గ్రామాల్లో చెత్త సేకరణలో రెండు బుట్టల విధానం బదులుగా నాలుగు బుట్టల విధానం అమలు చేయాలని, దీనిపై వార్డుల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపర్చాలని, కంపోస్టు యార్డు నిర్వహణ పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేస్తే నోటీసులిచ్చి జరిమానా విధించాలని, గ్రామాల్లోని వ్యాపార సముదాయాలను గుర్తించి వారికి నోటీసులు ఇవ్వడం ద్వారా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, ప్రత్యామ్నాయ వస్తువులను పరిచయం చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి సమస్య ఎదురయ్యే అవకాశం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా వినియోగించే నీటి వనరులలో నీటి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ ధన్‌సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏఈ రాజు, ఏఓ సతీశ్, ఏపీఓ శంకర్ తదితరులు పాల్గొన్నారు.


