వానర సమస్యతో వరి, పత్తి సాగుకే రైతుల మొగ్గు కనిష్ట స్థాయిలో కూరగాయలు, పప్పు ధాన్యాల సాగు పంటల్లో కోతుల బెడదను గుర్తించని వ్యవసాయ శాఖ
వ్యవసాయంలో వైవిధ్యం పెంచాలని ప్రభుత్వం చెబుతోంది. రైతాంగం మాత్రం పత్తి, వరి వంటి ఒకేరకమైన పంటల సాగుకు మొగ్గు చూపుతోంది. కోతుల దాడుల వల్లే పెసర, కంది, కూరగాయల వంటి పంటల జోలికి వెళ్లడం లేదని పేర్కొంటోంది. అయితే వ్యవసాయ రంగంపై కోతుల దాడుల ప్రభావాన్ని సర్కార్ గుర్తించడం లేదు. కోతులను అరికట్టే బాధ్యత పంచాయతీలు/ మున్సిపాలిటీలదే అన్నట్టుగా వ్యవహరిస్తోంది.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
సమస్యను గుర్తించరేం ?
జిల్లాలో పంటల సాగులో వైవిధ్యం తగ్గడానికి ప్రధాన కారణం కోతుల దాడులేనని ఏళ్ల తరబడి రైతులు వాపోతున్నారు. ఆహార ధాన్య పంటలకు ప్రభుత్వం నుంచి మద్దతు ధర ఉంది. అయితే, పెసర, మినుములు, కంది సాగు కంటే కోతులు దాడులు చేయని వరి, పత్తి పంటల సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. వేరుశనగ, కూరగాయల సాగుకు ఇవే భయాలు ఉన్నాయి. గతంలో జిల్లాలో జీడి మామిడి భారీగా సాగయ్యేది. ఇప్పుడా స్థానాన్ని పామాయిల్, జామాయిల్‌లు ఆక్రమించాయి. పదిహేనేళ్లుగా క్రమంగా మార్పులు వస్తున్నాయి. అయినా రైతులకు మద్దతుగా నిలిచే వ్యవసాయశాఖ, కృషి విజ్ఞానకేంద్రాలు, వ్యవసాయ కళాశాల/వర్సిటీలు కోతుల సమస్యకు శాసీ్త్రయ పరిష్కారం చూపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమీ లేవని రైతులు అంటున్నారు.
వైవిధ్యానికి చోటెక్కడ?
గత ఖరీఫ్ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. 2 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆ తర్వాత స్థానంలో వరి, మొక్కజొన్న సాగు చేపట్టారు. ఈ మూడు పంటలను కలిసి జిల్లా సాగు విస్తీర్ణంలో 75 శాతంగా ఉన్నాయి. ఇక ఉద్యాన పంటలైన పామాయిల్, జీడి, పండ్ల తోటల వాటా 16 శాతంగా ఉంది. ఆ తర్వాత అగ్రోఫారెస్ట్రీ విభాగంలో జామాయిల్, సుబాబుల్, టేకు సాగు సుమారు 29 వేల ఎకరాల్లో ఉండగా, వీటి వాటా దాదాపు 5 శాతంగా ఉంది. ఇక వాణిజ్య పంటల్లో మిర్చి 11 వేల ఎకరాల్లో సాగవుతూ సుమారు రెండు శాతం వాటాను కలిగి ఉంది. పత్తి, వరి, మొక్కజొన్న, పామాయిల్, పండ్ల తోటలు, జామాయిల్, మిర్చిలే జిల్లాలో 98 శాతం వ్యవసాయ భూముల్లో సాగవుతున్నాయి.
డిమాండ్ ఉన్నా.. దిగుమతే
జిల్లా వ్యవసాయంలో వైవిధ్యం పూర్తిగా కరువైంది. ఫలితంగా రోజు ఉపయోగించే కూరగాయలు సైతం పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇల్లెందు, టేకులపల్లి, సుజాతనగర్ వంటి కొన్ని ప్రాంతాల్లో కేవలం 500 ఎకరాలకే కూరగాయల సాగు పరిమితమైంది. గతంలో మునగ సాగుపై ప్రచారం చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. మరోవైపు కంది, పెసర, వేరుశనగ వంటి ఆపరాల పంటలకు ప్రభుత్వం నుంచి మెరుగైన మద్దతు ధర లభిస్తోంది. పైగా వరి, పత్తితో పోల్చితే ఈ పంటలు సాగు చేయడం ద్వారా రైతులకు వచ్చే రాబడి ఎక్కువ. అయినా పప్పు దినుసులు అన్ని కలిపి కూడా 2,200 ఎకరాలకే పరిమితమయ్యాయి. ఒక్క వరిని మినహాయిస్తే మిగిలిన అన్ని ఆహార పంటలపైన కోతుల దాడులు ఉధృతం అవడం వల్ల ఈ మార్పు చోటుచేసుకుంది.
కోతుల దాడులతో తగ్గిన వైవిధ్య పంటల సాగు
ఆహారధాన్యాలు సాగు విస్తీర్ణం మద్దతు ధర
(ఎకరాల్లో)
వరి 1,65,965 రూ. 2,461
మొక్కజొన్న 86,544 రూ. 2,400
వేరు శనగ 2,791 రూ.7,517
మినుములు 857 రూ.8,200
కంది 1,159 రూ.8,450
పెసర 131 రూ.8,760


