ఈసారి లక్ష్యం 55.40 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఈసారి లక్ష్యం 55.40 లక్షలు

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

● వన మహోత్సవానికి సిద్ధమైన అధికారులు ● శాఖలవారీగా మొక్కల లక్ష్యాల కేటాయింపు ● అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలు కేటాయించాం

జిల్లాలో ఇప్పటి వరకు నాటిన మొక్కలు(లక్షల్లో)

● వన మహోత్సవానికి సిద్ధమైన అధికారులు ● శాఖలవారీగా మొక్కల లక్ష్యాల కేటాయింపు ● అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు

చుంచుపల్లి: వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. పల్లెలు, పట్టణాల్లో మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపడుతోంది. గత గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ ప్రాంతంలో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అక్కడి నుంచే వర్చువల్‌ పద్ధతిలో జిల్లాలోని కిన్నెరసాని వద్ద వన మహోతవ కార్యక్రమాన్ని ఆరంభించారు. కలెక్టర్‌ అంకిత్‌ తదితరులు అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలోని 471 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా వన నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకాన్ని చేపట్టారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హరిత నర్సరీలు, అటవీ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో మరో 32 నర్సరీల్లో మొక్కలు పెంచారు. పెద్ద పంచాయతీల్లో 15 వేలు, చిన్న గ్రామపంచాయతీల్లో 10 వేల చొప్పున 15 రకాల జాతుల మొక్కల పెంపకం చేపట్టారు. ఇందులో కానుగ, వేప, చింత, నేరేడు, గుల్‌ మొహర్‌, జామ, వెలగ, శిశు, మునగ, సీమ తంగేడు, తులసి, గులాబీ, మందార, గన్నేరు, దిరిశన, అల్ల నేరేడు, ఉసిరి, దానిమ్మ, ఈత, బొప్పాయి, మందార, సిసో, టికోమ, బహునియా, సెలోఫాం తదితర మొక్కలు ఉన్నాయి. వీటిని గ్రామాల్లో అంతర్గత, అనుసంధాన రోడ్లకు ఇరువైపులా, చెరువు, కాలువ కట్టలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఖాళీ స్థలాల్లో నాటనున్నారు. మొక్కలు నాటేందుకు ఉపాధి కూలీలు గుంతలు తవ్వుతున్నారు. గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నారు. అడిగిన ప్రతీ సన్నకారు, చిన్నకారు రైతుకు ఎకరానికి 100 వరకు టేకు మొక్కలను ఇవ్వనున్నారు.

55.40 లక్షల మొక్కలు లక్ష్యం

వనమహోత్సవంలో ఈ ఏడాది జిల్లాలో 55.40 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వ శాఖల వారీగా లక్ష్యాలను కేటాయించారు. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖకు అత్యధికంగా 25.60 లక్షలు, విద్యుత్‌శాఖకు 9 లక్షలు, అటవీశాఖకు 9.40 లక్షలు, మున్సిపల్‌ శాఖకు 5.20 లక్షలు, వ్యవసాయశాఖకు 4.70 లక్షలు, రెవెన్యూకు 1.30 లక్షలు, ఇండస్ట్రియల్‌కు 20 వేల మొక్కల చొప్పున లక్ష్యాలను అప్పగించారు. మొక్కలు నాటడం, సంరక్షణకు రూ.25 కోట్ల నిధులు అవసరమని అంచనా వేశారు. నాటే మొక్కల్లో కచ్చితంగా 85 శాతం బతికేలా చర్యలు తీసుకోనున్నారు.

వన మహోత్సవానికి కావా ల్సిన మొక్కలను సిద్ధంగా ఉంచాం. గ్రామ పంచాయతీలు, అటవీ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నాం. ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు నాటే లక్ష్యాలను ఇప్పటికే కేటాయించాం. వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.

–ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ

2015-16 111.49

2016-17 161.33

2017-18 163.09

2018-19 96.17

2019-20 146.27

2020-21 160.29

2021-22 135.41

2022-23 105.08

2023-24 55.13

2024-25 70.61

2025-26 71.41

2026-27 55.40

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement