భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి శుక్రవారం అర్చకులు పంచామృతాభిషేకం నిర్వహించారు. అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఉపకార వేతనాలకు
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్స్‌లో చదువుతున్న 9, 10వ తరగతి బీసీ, ఈబీసీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, హార్డ్ కాపీలను తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
పర్యాటకుల ‘సఫారీ’
పాల్వంచరూరల్: కిన్నెరసాని అభయారణ్యంలో శుక్రవారం పలువురు పర్యాటకులు సఫారీలో విహరించారు. అటవీశాఖ వైల్డ్‌లైఫ్ విభాగం జంగల్ సఫారీ వాహనాల టూర్‌ను గురువారం ప్రారంభించిన విషయం విదితమే. తొలిరోజు 14 మంది పర్యాటకులు సఫారీ వాహనంలో ప్రయాణించగా రూ.2,800 ఆదాయం లభించినట్లు వైల్డ్‌లైఫ్ సెక్షన్ ఆఫీసర్ కిషన్ తెలిపారు. ఒక వాహనం రెండు ట్రిప్‌లు మాత్రమే తిరిగిందని, ఒక్కో టూరిస్టు నుంచి రూ.200 చొప్పున టికెట్ వసూళ్లు చేశామని పేర్కొన్నారు.


