ఆర్‌అండ్‌ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ శివకుమార్
అశ్వాపురం: జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్‌అండ్‌ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దుమ్ముగూడెం ఆనకట్టను, సీతమ్మసాగర్ బ్యారేజీని, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం బీజీ కొత్తూరులోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్ సమావేశ మందిరంలో కలెక్టర్ అంకిత్‌తో కలిసి సాగునీటి ప్రాజెక్ట్‌ల భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సీతారామ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం తదితర ప్రాజెక్ట్‌లకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, అటవీ అనుమతులు, సర్వే పనులు, కోర్టు కేసుల పురోగతిపై సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవార్డుల జారీ, పరిహారం చెల్లింపుల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ఫేస్–1లో 1,522 ఎకరాలు, ఫేస్–2లో 2,365 ఎకరాలకు అవార్డులు జారీ చేసి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. ఫేస్–3లో 1,621 ఎకరాలకు గాను 1,350 ఎకరాలకు అవార్డులు జారీ చేశామని, 903 ఎకరాలకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు–1, 2, 6లకు సంబంధించిన భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్‌డీఎల్‌సీలు రవీంద్రనాథ్, వెంకట్రావు, మండల తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు రమేష్, యాసిన్ పాషా తదితరులు పాల్గొన్నారు.


