ఎవరిని ఎంపిక చేయాలో..? | - | Sakshi
Sakshi News home page

ఎవరిని ఎంపిక చేయాలో..?

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

● ప్రీప్రైమరీ స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల ఎంపికపై రాజకీయ జోక్యం ● తలలు పట్టుకుంటున్న హెచ్‌ఎంలు.. ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 ప్రీప్రైమరీ పాఠశాలలు

● ప్రీప్రైమరీ స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల ఎంపికపై రాజకీయ జోక్యం ● తలలు పట్టుకుంటున్న హెచ్‌ఎంలు.. ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 ప్రీప్రైమరీ పాఠశాలలు

ఇల్లెందు: ప్రాథమిక విద్య బలోపేతం కోసం ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల ఎంపిక బాధ్యత తలకు మించిన భారంగా మారింది. జిల్లాలో 118 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కోసం 236 మంది ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలను ఎంపిక చేయాలని పాఠశాలలకు జాబితా పంపారు. అయితే, ఒక్కో పాఠశాలలో ఒక్కో పోస్టుకు కనీసం 10 మందికిపైగా ఉన్నత చదువులు చదువుకున్న వారు దరఖాస్తు చేశారు. అంతటితో ఆగకుండా జోరుగా పైరవీలు మొదలు పెట్టారు. దీంతో పాఠశాలలు పునప్రారంభమైనా చాలాచోట్ల ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఎంపికలు జరగలేదు. రాజకీయాలను అధిగమించి ప్రక్రియను పూర్తి చేయాలంటే తలకు మించిన భారంగా మారిందని హెచ్‌ఎంలు లబోదిబోమంటున్నారు. ఈ బాధ్యతను తమకు ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కోచోట ఒక్కోరకంగా ఒత్తిడి వస్తోందని హెచ్‌ఎంలు మదన పడుతున్నారు. ఇక ఇల్లెందు మండలంలో 14 ప్రీ ప్రైమ రీ పాఠశాలలను మంజూరు చేశారు. ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులకు ప్రీ ప్రైమరీ టీచింగ్‌ ట్రైనింగ్‌ ఉత్తీర్ణులైన వారికి, ఆయాలకు 7వ తరగతి చదివిన వారికి అవకావం కల్పించాలని సూచించారు. అయితే అక్కడి హెచ్‌ఎంలు మాత్రం ఎంపిక కోసం ఎలా ముందుకు వెళ్లాలని సమాలోచనలు చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఛేదించుకుని ఎంపిక చేయలేమని చేతులు ఎత్తేశారు. ఈ బాధ్యత తమకు ఎంతమాత్రం సహేతుకం కాదని డీఈఓ, ఎంఈఓ స్థాయిలో చేసినట్లయితే బాగుండేదంటున్నారు. మండలంలోని ఓ ప్రీ ప్రైమరీ పాఠశాలలో 32 దరఖాస్తులు ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుకు.. ఆరు దరఖాస్తులు ఆయా పోస్టుకు వచ్చాయి. ఇందులో రాజకీయ ఒత్తిళ్లు తీవ్రంగా ఉన్నాయి. ప్రజాప్రతినిధులు, పాఠశాల కమిటీ నుంచి ఒత్తిడి పెరుగుతోంది.

ప్రాథమిక పాఠశాలలో అంతర్భాగం

ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్లు నిండిన చిన్నారు లను చేర్చుకుంటారు. కానీ, నాలుగేళ్లు నిండిన వారిని ఈ ప్రీ ప్రైమరీలో చేర్చి వారికి ఏడాది పాటు శిక్షణ ఇచ్చి, 5వ ఏట అక్కడి ప్రాథమిక పాఠశాలలో చేర్పిస్తారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలు అక్కడి ప్రా థమిక పాఠశాలలో అంతర్భాగంగా ఉంటాయి. ఆ ప్రాథమిక పాఠశాలలోనే ఒక గదిని వీటికోసం కేటాయించాల్సి ఉంది. ఇన్‌స్ట్రక్టర్‌, ఆయాతో పాటు ప్రతీ ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఏడాది బోధనకు ఉపయోగపడే మెటీరియల్‌ అందజేయనున్నారు. అక్కడి ప్రాథమిక పాఠశాలలోనే వీరికి మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఏడాది తర్వాత వారు సంసిద్ధులుగా మారినందున అక్కడి ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతితో చేర్పిస్తారు. పాఠశాలకు సంసిద్ధులను చేసేందుకే ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఉపయోగపడనున్నాయి. అయితే, అందులో ఇన్‌స్ట్రక్టర్ల ఎంపిక మాత్రం హెచ్‌ఎంలకు కత్తిమీద సాములా తయారైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement