బూర్గంపాడు: ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శుక్రవారం ఉదయం బూర్గంపాడులో పోలీసులు పట్టుకున్నా రు. ఎస్‌ఐ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. ఏపీ లోని జగ్గయ్యపేట నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని బూర్గంపాడు మార్కెట్‌యార్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు. లారీలో 28 టన్నుల రేషన్ బియ్యం ఉండటంతో సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తరలిస్తున్న మల్కన్‌గిరికి చెందిన లారీ ఓనర్ నవీన్‌కుమార్ బాత్ర, లారీడ్రైవర్ బికాస్ ఆచార్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బియ్యం సరఫరా చేసిన శ్రీరంగం సత్యనారాయణపై కూడా కేసు నమోదు చేశామని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ ప్రసాద్ వివరించారు.
మహిళ అదృశ్యంపై కేసు
ఇల్లెందు: పట్టణంలోని ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన తన భార్య ఏప్రిల్ 24 నుంచి కనిపించడం లేదని ఆమె భర్త గుండంపల్లి సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ అరుణ కథనం ప్రకారం.. 19వ వార్డు ఎల్‌బీఎస్‌నగర్‌కు చెందిన గుండంపల్లి అరుణతోపాటు బంగారు ఆభరణాలు రూ.50వేల నగదు, 30తులాల వెండి పట్టీలు కూడా కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏటూరునాగారానికి చెందిన వడ్రంగి పనిచేసే బట్టు సుమన్‌పై తనకు అనుమానం ఉందని, గతంలో కూడా పంచాయితీలో తనను హతమారుస్తానని బెదిరించాడని, ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని ఫిర్యాదులో సతీశ్ వివరించాడు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వెల్లడించారు.
అతి వేగంగా డీసీఎం వ్యాన్ నడిపిన డ్రైవర్?
పాల్వంచ: భద్రాచలం రహదారిపై ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్ శుక్రవారం రాత్రి అతి వేగంతో నడుపుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో కొంత మంది వాహనదారులు ఆందోళనలకు గురయ్యారు. పాల్వంచ నుంచి కొత్తగూడెం వరకు సదరు డ్రైవర్ అతి వేగంతో వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లగా మార్గమధ్యలో అక్కడక్కడా పలు వాహనాలకు తగిలించినట్లు తెలిసింది. దీంతో కొందరు వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి పోలీసులు సదరు వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పాల్వంచ సమీపంలో ఒకరిద్దరికీ గాయాలు చేసినట్లు అనుమానంతో పాల్వంచ పోలీసులకు వ్యాన్‌ను అప్పగించారు. ఈ విషయమై పట్టణ ఎస్‌ఐ నాగరాజును వివరణ కోరగా వ్యాన్‌తో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, అయితే ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని, ఎలాంటి ప్రమాదాలు చేసినట్లు కూడా ప్రస్తుతానికి తేలలేదని, పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు.
నర్సుపై దాడి చేసిన పేషెంట్?
భద్రాచలంటౌన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగి విధుల్లో ఉన్న నర్సుపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై బాధిత నర్సు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పోలీసులు విచారణ చేపట్టగా, వైద్యపరమైన సమస్యల కారణంగా ఆందోళనకు గురై తాను అలా ప్రవర్తించినట్లు రోగి తెలిపినట్లు తెలిసింది. అలాగే రోగి కుటుంబ సభ్యులు కూడా నర్సును కలిసి క్షమాపణలు కోరినట్లు సమాచారం. ఇరువర్గాల మధ్య రాజీ కుదరడంతో ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిసింది. ఆస్పత్రి వర్గాలు సైతం ఘటనను సామరస్యపూర్వకంగా పరిష్కరించినట్లు పేర్కొన్నాయి.


