‘చేయూత’కు ఈ–కేవైసీ! | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’కు ఈ–కేవైసీ!

Jun 20 2026 12:13 AM | Updated on Jun 20 2026 12:13 AM

● ఖమ్మం జిల్లాలో 1.45 లక్షల మంది లబ్ధిదారుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ పూర్తి ● ఇంకా పెండింగ్‌లో 28,867 మంది పెన్షనర్లు ● ఐరిష్‌ నమోదు కాకపోతే వేలిముద్రల సేకరణ ● వారంలోగా పూర్తిచేసేలా కార్యాచరణ

● ఖమ్మం జిల్లాలో 1.45 లక్షల మంది లబ్ధిదారుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ పూర్తి ● ఇంకా పెండింగ్‌లో 28,867 మంది పెన్షనర్లు ● ఐరిష్‌ నమోదు కాకపోతే వేలిముద్రల సేకరణ ● వారంలోగా పూర్తిచేసేలా కార్యాచరణ

ఖమ్మంమయూరిసెంటర్‌: ఆసరా (చేయూత) పెన్షన్ల పంపిణీని మరింత పారదర్శకంగా అమలుచేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫేషియల్‌ రిక గ్నైజేషన్‌ సిస్టమ్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌) అమలు కొనసాగుతోంది. అర్హులైన వారికి పింఛన్‌ అందిస్తూ, అనర్హులు, మృతుల పేర్లను జాబితా నుంచి తొలగించాలనే లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈనెల 15 నాటికే ప్రక్రియను ముగించాల్సి ఉన్నా.. సాంకేతిక కారణాలు, ఎఫ్‌ఆర్‌ఎస్‌లో లబ్ధిదారుల ఐరిస్‌ నమోదు కాకపోవడంతో వంటి కారణాలతో జాప్యం జరిగింది. ఈ నేపథ్యాన వారం రోజుల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

82శాతం పూర్తి

ఖమ్మం జిల్లాలో 1,76,477 మంది వివిధ రకాల పింఛన్లు తీసుకుంటున్నారు. అందులో ఇప్పటివరకు 1,45,195 మంది(సుమారు 82 శాతానికి పైగా) లబ్ధిదారుల ఎఫ్‌ఆర్‌ఎస్‌ గుర్తింపు పూర్తయింది. మిగిలిన 28,867 మంది గుర్తింపు చేపట్టాల్సి ఉంది. అధికారులు, పంచాయతీ కార్యాలయాల సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది క్షేత్రస్థాయిలో వీరి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పలువురి విషయంలో సాంకేతిక కారణాలు, ఇతర అంశాల ఆధారంగా అధికారులు రిమార్క్‌ నమోదు చేశారు.

త్వరలోనే నూరు శాతం

మొత్తం ప్రక్రియలో ఇంకా 571 ఆధార్‌ సంబంధిత అంశాలు పెండింగ్‌ ఉన్నాయి. మొత్తంగా మిగిలిన 28,867 మందికి కూడా వీలైనంత త్వరగా ఈ–కేవైసీ లేదా ఎఫ్‌ఆర్‌ఎస్‌ పూర్తి చేయాలని యంత్రాంగం భావిస్తోంది. అర్హులైన లబ్ధిదారులెవరూ నష్టపోవద్దనే ఉద్దేశంతో మంచానికే పరిమితమైన వారి వద్దకు సిబ్బందే స్వయంగా వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. అనర్హుల తొలగింపు, నిజమైన పేదలకు న్యాయం జరగడానికి ఈ ప్రక్రియ దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement