టేకులపల్లి: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని కోయగూడెం నుంచి శుక్రవారం గంగారం వైపు వెళ్తున్న ఖాళీ ట్రాక్టర్ దంతలతండా దాటిన తర్వాత అదుపుతప్పి రోడ్డుపక్కు దూసుకెళ్లి బోల్తాపడింది. తీవ్రంగా గాయపడిన గంగారం గ్రామానికి చెందిన డ్రైవర్ కుంజా రాజాబాబు (32), ఊకే నాగేశ్వరరావుకు 108 ఈఎంటీ రాధ, పైలట్ వెంకట రామారావు ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా రాజాబాబు మృతిచెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ
పలువురికి గాయాలు
భద్రాచలంటౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శుక్రవారం పల్లెవెలుగు బస్సు, లారీ ఢీకొన్నాయి. లారీడ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమా దంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కోడి పందేల స్థావరంపై దాడి
దమ్మపేట: మండలంలోని రాచూరుపల్లి శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నవారిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాచూరుపల్లి శివారులో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు పరారయ్యారు. ఘటనా స్థలం నుంచి ఒక కోడిపుంజు, ఆరు బైక్‌లు, రూ.600 నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ బాలస్వామి తెలిపారు.


