అలా.. మొదలైంది! | - | Sakshi
Sakshi News home page

అలా.. మొదలైంది!

Jun 15 2026 12:17 AM | Updated on Jun 15 2026 12:17 AM

● అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం ● కుటుంబీకుల ప్రోత్సాహం, గురువుల బోధనతో ఉన్నతస్థానాలకు.. నాన్న సైకిల్‌పై నేను, చెల్లి, తమ్ముడు అన్నయ్య చేయి పట్టుకుని నడిచా.. సైకిళ్లపై స్కూలుకు వెళ్లేవాళ్లం

‘బడి బాట’ జ్ఞాపకాల్లో అధికారులు
● అడ్డంకులను అధిగమిస్తూ విద్యాభ్యాసం ● కుటుంబీకుల ప్రోత్సాహం, గురువుల బోధనతో ఉన్నతస్థానాలకు..

భద్రాచలంఅర్బన్‌/ఖమ్మంవ్యవసాయం: వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి నూతన విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ క్రమాన పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈసారే పాఠశాల బాట పట్టనుండగా.. ఇంకొందరు కొత్త తరగతిలోకి వెళ్లనున్నారు. ఈ క్రమాన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులను వారి ‘బడి’జ్ఞాపకాలపై ఆరా తీయగా ఆ సంగతులన్నీ ఆసక్తిగా వివరించారు. స్ఫూర్తిదాయకమైన ఆ వివరాలు...

మాది సింగరేణి మండలం గేటుకారేపల్లి. నాన్న భూక్యా చిట్టిబాబు పోస్టుమాస్టర్‌గా పనిచేస్తూనే వ్యవసాయం చేసేవారు. అమ్మానాన్న చిట్టిబాబు – రాధకు నేను మొదటి కుమార్తెను. ఆ తర్వాత చెల్లె సుజాత, తమ్ముడు అరుణ్‌ ఉన్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి సిద్ధమయ్యా క నాన్న సైకిల్‌పై తీసుకెళ్లి స్కూల్‌లో దింపేవారు. ఎనిమిదో తరగతికి వచ్చాక కారేపల్లి హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో బుగ్గవా గు ఉండడంతో చదువు లో వెనకబడతామని నాన్న భద్రాచలం ఏపీఆర్‌ఎస్‌లో చేర్పించారు. ఇంటర్‌ వరకు అక్కడ చదివాక అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ, ఆపై ఎమ్మెస్సీ పూర్తి చేశా. గెజిటెడ్‌ ఉద్యోగం చేయాలనే నాన్న ఆశయం మేరకు దమ్మ పేట ఏఓగా గెజిటెడ్‌ ర్యాంక్‌ ఉద్యోగం సాధించాం. ప్రస్తుతం ఖమ్మం ఆత్మ పీడీగా కొనసాగుతున్నా.

–బి.సరిత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఖమ్మం

మాది వరంగల్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం తిమ్మాపూర్‌. అమ్మానాన్న యాదగిరి – భాగ్య వ్యవసాయం చేస్తూ నన్ను, మా అన్నయ్య రాజును చదివించారు. చిన్నప్పుడు నేను స్కూల్‌కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని. కానీ అన్నయ్య సర్దిచెప్పి వెంట తీసుకెళ్లేవాడు. మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలో 10వ తరగతి పూర్తి చేశాక, ఇంటర్‌ వరంగల్‌లో చదివి ఓపెన్‌ డిగ్రీ పూర్తిచేశా. 2007లో హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2009లో ఎస్‌ఐగా ఎంపికవడంతో తొలి పోస్టింగ్‌ కరకగూడెంలో వచ్చింది. ఈ జిల్లాలోని పలు స్టేషన్లలో విధులు నిర్వర్తించాక సీఐగా పదోన్నతిపై హైదరాబాద్‌ వెళ్లినా, మళ్లీ డీఎస్పీగా పదోన్నతితో భద్రాచలంలో పోస్టింగ్‌ వచ్చింది. మా అన్నయ్య రాజు జనగామ జిల్లా రెవెన్యూ శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. అన్నయ్య ప్రోత్సాహంతోనే చదువు పూర్తిచేసి ఈ స్థాయికి చేరగలిగా.

–అరుణ్‌కుమార్‌,

భద్రాచలం డీఎస్పీ

మా నాన్న ఎన్‌.ఎస్‌.రాయుడు న్యాయవాది కాగా, అమ్మ లక్ష్మీదేవి రైల్వే శాఖలో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. దీంతో సికింద్రాబాద్‌లోని రైల్వే పాఠశాలలో నా చదువు కొనసాగింది. అమ్మ ఉదయం క్యారేజీ రెడీ చేస్తే, ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లే వరకు నాన్న వెంట ఉండేవారు. ప్రాథమిక తరగతులకు ఆటోలో వెళ్లగా, ఆ తర్వాత స్నేహితులతో కలిసి సైకిళ్లపై స్కూల్‌కు వెళ్లా. అమ్మానాన్న సూచనలతో చదువు, క్రమశిక్షణలో ముందు నిలుస్తూ చదువులో స్నేహితులతో పోటీ పడేవాడిని. ఇంజనీరింగ్‌ అయ్యాక ఎస్‌బీఐ, ఇంటెలిజెన్స్‌ శాఖలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ రైతులకు సేవలందించాలనే తపనతో డీసీసీబీ సీఈఓ పోస్టు ఎంచుకున్నా.

–ఎన్‌.వెంకటఆదిత్య,

డీసీసీబీ సీఈఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement