మూసిన గనుల నుంచే
బొగ్గు తీస్తున్న సింగరేణి
పదేళ్లపాటు బొగ్గు బ్లాకుల
వేలానికి దూరం
2025లో వేలానికి వెళ్లినా
అప్పటికే తీరని నష్టం
క్రమంగా తగ్గిపోతున్న ఉత్పత్తి
సామర్థ్యం
పేర్లే కొత్తవి!
టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో లేని రోజుల్లో గనుల నుంచి పెద్ద మొత్తంలో బొగ్గును వెలికి తీయడం సాధ్యం అయ్యేది కాదు. దీంతో మూసివేసిన చాలా గనుల్లో ఇప్పటికీ బొగ్గు నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు అలా పేరుకుపోయిన నిల్వలను వెలికి తీయడాన్నే కొత్త గనుల ప్రారంభంగా సింగరేణి పేర్కొంటోంది. కొత్తగూడెం ఏరియాలో మూతపడిన భూగర్భ (యూజీ), ఓపెన్‌కాస్ట్ (ఓసీ) గనులు నాలుగింటిని కలిపి వెంకటేశ్‌ఖని మెగా ఓసీ పేరుతో గతేడాది నవంబర్‌లో పనులు ప్రారంభించింది. ఇల్లెందులో జవహర్‌ఖని ఓసీ ఎక్స్‌టెన్షన్స్, మణుగూరులో కొండాపూర్ ఓసీది ఇదే పరిప్థితి. ఈ రెండు ఏరియాల్లో కొత్త గనుల మాటే లేదు. తాజాగా రామగుండం–1, 2 ఏరియాల పరిధిలో మూసి వేసిన రెండు యూజీ లు, మూడు ఓసీలను ఒక్కటిగా చేసి రామగుండం మెగా కోల్‌మైన్ పేరుతో కొత్త గనికి అనుమతులు తెచ్చుకుంది. ఇలా పాత గనులకే కొత్త పేరు పెట్టుకుని ఘన విజయం సాధించినట్టుగా సంస్థ ప్రచా రం చేసుకోవడం విస్మయం కలిగిస్తోందని కార్మికులు అంటున్నారు. కేవలం కార్మికులు, యంత్రాల వినియోగం కోసమే ఇలా పాత గనులను కొత్తవిగా ప్రారంభిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
2015 అక్టోబర్ నుంచి కేంద్రం బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం దేశంలో బొగ్గు నిల్వలు ఉన్న ప్రాంతాలను బ్లాకులుగా గుర్తించి, బహిరంగ వేలం పద్ధతిలో మైనింగ్ కంపెనీలకు లీజుకు ఇస్తోంది. అప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాకులపై సింగరేణిది గుత్తాధిపత్యమే అని చెప్పుకోవచ్చు. దీంతో కేంద్ర నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అందుకు తగ్గట్టుగానే బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియకు దూరంగా ఉంది. ఫలితంగా 2014 నుంచి 2014 వరకు సింగరేణి సంస్థకు కొత్తగా ఒక్క బొగ్గు బ్లాకు కూడా దక్కలేదు.
కేంద్రం తీసుకున్న చర్యల పర్యావసానంగా తాడిచర్ల (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) ఓసీ గని నుంచి 2017లో ప్రైవేట్ సెక్టార్‌లో బొగ్గు ఉత్పత్తి మొదలైంది. ఆ తర్వాత కోయగూడెం బ్లాక్–3, శ్రావణ్‌పల్లి, సత్తుపల్లి బ్లాక్–3 ప్రైవేటు పరమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేళ్లపాటు పట్టు విడుపులు లేకుండా వ్యవహరించడం సింగరేణి పాలిట శాపంగా మారింది. ఎట్టకేలకు 2025లో బొగ్గు బ్లాక్‌ల వేలానికి వెళ్లాలని నిర్ణయించారు. అయితే, అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తెలంగాణ రావడానికి ముందే దక్కించుకున్న సత్తుపల్లి ఏరియాలో కిష్టారం ఓసీ, శ్రీరాంపూర్ ఏరియాలో ఇందారం ఓసీ, మందమర్రి ఏరియాలో కల్యాణిఖని ఓసీ, ఒడిశాలో నైనీ ఓసీ గనులే గడిచిన పదేళ్ల కాలంలో ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తూ సంస్థ మనుగడకు ఆయువుపట్టుగా మారాయి. లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
తెలంగాణ వచ్చిన తర్వాత సింగరేణి రూటు మార్చింది. థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ రంగాల్లో అడుగు పెట్టి సానుకూల ఫలితాలు సాధించింది. ఇదే క్రమంలో బహుముఖంగా విస్తరించే లక్ష్యంతో మరింతగా థర్మల్, సోలార్ రంగాల్లో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మైనింగ్, కాపర్ బ్లాకులను దక్కించుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొత్త బొగ్గు బ్లాకులు దక్కించుకోకుంటే సంస్థ మనుగడ ఏంటనే అంశం చర్చలోకి రాకుండా పోయింది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకుని కేవలం 58 మిలియన్ టన్నుల దగ్గరే ఆగిపోయి చేదు ఫలితాలను చవిచూసింది.
బొగ్గు ఉత్పత్తి రంగంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్త గనులను ప్రారంభించే అవకాశం లేక పాత గనుల్లో మిగిలినపోయిన బొగ్గును ఇప్పుడు వెలికితీస్తోంది. ఇలా వెలికి తీసే గనులకే మెగా గనులంటూ కొత్త పేరు పెడుతోంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


