భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
వైభవంగా రుద్రహోమం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి అమ్మవారికి వైభవంగా రుద్రహోమం, పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు.అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణ పతి హోమం నిర్వహించారు. యాగశాలలో జరిగిన రుద్రహోమ పూజల్లో మూడు భక్త జంటలు పాల్గొన్నాయి.
ప్రశాంతంగా ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో శుక్రవారం జరిగాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో గణిత శాస్త్రం పేపర్–1ఏ, బోటనీ పేపర్–1, రాజకీయ శాస్త్రం పేపర్–1 పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. పరీక్షలకు జనరల్ విభాగంలో 2,971 మంది, ఒకేషనల్ విభాగంలో 217 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 3,188 మంది హాజరుకావాల్సి ఉండగా, 3,037 మంది హాజరయ్యారని వివరించారు. జనరల్ విభాగంలో 132 మంది, ఒకేషనల్ విభాగంలో 19 మంది కలిపి మొత్తం 151 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు వెల్లడించారు.
అప్రమత్తంగా ఉండాలి
మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి
మణుగూరు రూరల్: అసాంఘిక కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని సమితిసింగారం గ్రామపంచాయతీ పరిధి వాగుమల్లారం ప్రాంతంలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్(కార్డెన్ సెర్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ నేతృత్వంలో మణుగూరు, అశ్వాపురం, ఏడూళ్లబయ్యారం సీఐలు పి.నాగబాబు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వరరావులు, ఎస్సైలు, సిబ్బంది ప్రతీ ఇంటిని తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని, నంబర్ ప్లేట్లు లేని 80ద్విచక్రవాహనాలను, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మూడు బెల్ట్ షాపుల్లో మద్యం స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక శక్తులకు సహకరించొద్దని అన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఇళ్లను అద్దెలకు ఇవ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితిసింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఎస్సైలు సీహెచ్ నగేష్, సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


