విభేదాలు వీడాలి | - | Sakshi
Sakshi News home page

విభేదాలు వీడాలి

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

పార్టీ శ్రేణులు ఐక్యంగా

ముందుకు వెళ్లాలి

ఉమ్మడి జిల్లాలో పార్టీకి

శస్త్ర చికిత్స అవసరం

బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్‌

రవీందర్‌రావు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి శస్త్ర చికిత్స అవసరమని, శ్రేణులు విభేదాలు విడనాడి ఐక్యంగా ముందుకు సాగాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌ తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. మనల్ని మనమే పొడుచుకునే పద్ధ్దతికి స్వస్తి పలికి అందరూ ఏకతాటిపైకి వచ్చి పదికి పది అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలకు సమష్టి కృషి చేయాలని సూచించారు. జిల్లా బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైనందున రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్‌ తిరిగి ముఖ్యమంత్రి కావా లని కోరుకుంటున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో పార్టీ నాయకత్వంలో విభేదాలు ఉండవద్దని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించారు. సభ్యత్వ నమో దు డిజిటల్‌ పద్ధతిలో ఉంటుందని నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జిని నియమిస్తామని, బూత్‌లెవెల్‌లో ఇద్దరిని నియమిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగిన మోదీ సభలో బడే భాయ్‌ మోదీ, చోటే భాయ్‌ రేవంత్‌రెడ్డి ఐక్యత కనిపించిందని ఎద్దేవా చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దిగే వరకు పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. హైదరాబా ద్‌ బహిరంగ సభలో ప్రజలు వణికిపోయే విధంగా మోదీ మాట్లాడారని విమర్శించారు. రైతుల ఉసురు పోసుకుంటున్నారని అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ రావాలి..రేవంత్‌రెడ్డి పోవాలి నినాదంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వ ర్లు బానోత్‌ హరిప్రియ, పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్‌, వనమా రాఘవేంద్రరావు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ప్రజాప్రతినిధులు, నాయకులు దామోదర్‌, రాంప్రసాద్‌, బాదావత్‌ శాంతి, సింధు తపస్వి, గుణచరిత్‌, అనుదీప్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement