యథేచ్ఛగా వన్యప్రాణుల వేట | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా వన్యప్రాణుల వేట

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

● విద్యుత్‌ కంచె ఏర్పాటుతో వేటగాళ్ల హల్‌చల్‌ ● పంట పొలాలు, అటవీ ప్రాంతాలే టార్గెట్‌ ● మూగజీవాలతో పాటు మనుషుల ప్రాణాలకూ ముప్పు ● వాగులు, వంకలకు వెళ్లాలంటేనే భయపడుతున్న జనం

ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు..

● విద్యుత్‌ కంచె ఏర్పాటుతో వేటగాళ్ల హల్‌చల్‌ ● పంట పొలాలు, అటవీ ప్రాంతాలే టార్గెట్‌ ● మూగజీవాలతో పాటు మనుషుల ప్రాణాలకూ ముప్పు ● వాగులు, వంకలకు వెళ్లాలంటేనే భయపడుతున్న జనం

మృత్యు‘తీగలు’..

బూర్గంపాడు: మండు వేసవిలో దాహార్తిని తీర్చుకునేందుకు వాగులు, వంకలు, పంట పొలాల్లోని బోర్ల వద్దకు వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు విద్యుత్‌ తీగలతో హతమార్చుతున్నారు. అడవి పందులే లక్ష్యంగా వేటగాళ్లు ప్రస్తుతం విద్యుత్‌ తీగలను అమర్చి వేటను కొనసాగిస్తుండగా.. ఆ తీగలు తాకి మేతకు వెళ్లిన పశువులు, జీవాలు మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలోని అశ్వారావుపేట, బూర్గంపాడు, ముల్కలపల్లి, దమ్మపేట, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, పాల్వంచ, కరకగూడెం మండలాల్లో వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతుంది.

రేయింబవళ్లు వేట..

గతంలో రాత్రిళ్లు మాత్రమే కొనసాగే వేట ఇప్పుడు పగటిపూట కూడా జరుగుతోంది. గతంలో అడవి జంతువుల వేటకు ఉచ్చులు పెట్టిన వేటగాళ్లు అడవి జంతువులతో పాటు చేపలను పట్టేందుకూ విద్యుత్‌ తీగలను వినియోగిస్తున్నారు. వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు గమనించని పశువులు, జీవాలు, ఇతర జంతువులు కూడా షాక్‌ గురై మృతిచెందుతున్నాయి. గతంలో విద్యుత్‌ తీగలు అమర్చిన వేట గాళ్లే ఆ విద్యుత్‌ తీగలు తాకి మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. అటవీ ప్రాంతాలకు, వాగులు, వంకలకు వెళ్లాలంటేనే ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన పరిస్థితులున్నాయి. అటవీశాఖ సిబ్బంది కూడా చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సిన పరిస్థితులున్నాయి.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం..

వన్యప్రాణుల వేటకోసం వేటగాళ్లు అమర్చిన విద్యు త్‌ తీగలతో విద్యుత్‌ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్‌ తీగలు తాకి పశువులు మృత్యువాత పడడంతో విద్యుత్‌ లైన్లు ట్రిప్‌ అయి సరఫరా నిలిచిపోతుంది. దీంతో ఏ ప్రాంతంలో లైన్‌ ట్రిప్‌ అయిందో తెలుసుకుని దాన్ని పునరుద్ధరించేందుకు విద్యుత్‌శాఖ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. లైన్లు తరచూ ట్రిప్‌ అవడంతో వ్యవసాయ విద్యుత్‌ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యథేచ్ఛగా సాగుతున్న అడవి జంతువుల వేటపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇటీవల కాలంలో అశ్వారావుపేట, ముల్కలపల్లి మండల్లాలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలకు అడవి పందులు, కుందేళ్లు మృత్యువాత పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

బూర్గంపాడు మండలంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్‌ తీగలు తాకి లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు చింతా నాగిరెడ్డి పాడి గేదెలు మృతిచెందాయి. వేటగాళ్లు మృతిచెందిన గేదెలను గమనించి వాటిని రాత్రికి రాత్రే ట్రాక్టర్‌లో ఎక్కించి సుమారు ఐదారు కిలోమీటర్ల దూరంలోని ఓ చెరువులో పడేశారు. ఈ ఘటనపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బూర్గంపాడు మండలంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలోని పెదవాగులో విద్యుత్‌ తీగలు అమర్చి చేపలు వేటాడుతున్న క్రమంలో సోమవారం ఓ వ్యక్తి మృతిచెందాడు.

కృష్ణసాగర్‌ గ్రామ సమీపంలో వేటగాళ్లు అడవిపందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు తాకి నాలుగు ఊరకుక్కలు, రెండు జంగు పిల్లులు మృతిచెందాయి. వాటిని వేటగాళ్లు తెల్లారేసరికి అక్కడ్నుంచి లేకుండా మాయం చేశారు.

సందెళ్లరామాపురం సమీపంలోని అటవీప్రాంతంలో విద్యుత్‌ తీగలకు ఆవులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వేటగాళ్లు కేసుల్లో ఇరుక్కోకుండా పశువుల యజమానికి డబ్బులు ఇచ్చి పంచాయతీని ముగించుకున్నట్లు ప్రచారం సాగుతుంది. ముల్కలపల్లి, దమ్మపేట మండలాల్లో ఇటీవల వేటగాళ్లు అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తూ పట్టుబడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement