కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం రాశులు
కాంటాలు, ఆ తర్వాత మిల్లులకు తరలింపులో తీవ్ర జాప్యం
తరుగు 10 కేజీలు ఇవ్వాలని తిరకాసు పెడుతున్న మిల్లర్లు
అకాల వర్షాలతో వడ్లు తడిసిపోతున్నాయని రైతుల ఆందోళన
లారీల రాక.. మక్కలు తరలించక
8,500 మెట్రిక్ టన్నులు కొన్నాం
సగం ధాన్యం తడిసింది
పాల్వంచరూరల్: అన్నదాత ధాన్యం పండించటం కంటే అమ్ముకునేందుకే ఎక్కువ అవస్థ పడాల్సి వస్తోంది. యాసంగి వడ్లలో తాలు అధికంగా ఉందని, పీఆర్–126 రకం దొడ్డుగా ఉన్నాయని మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. ఇప్పటికే క్వింటాల్‌కు ఐదు కేజీలు తరుగు తీస్తుండగా, మరో ఐదు కేజీలు తీస్తామంటున్నారు. మరోవైపు అకాల వర్షాలతో రైతులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఇటీవల కురిసిన వానలతో జిల్లాలోని పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. పాల్వంచ మండలం సోములగూడెం కొనుగోలు కేంద్రంలోనే సుమారు 12 వందల క్వింటాలకుపైగా ధాన్యం నిల్వలు ఉన్నాయి. మిగతా కేంద్రాల్లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది.
కాంటాపెట్టి మూడు రోజులైనా...
కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టేందుకు కూడా జాప్యం చేస్తున్నారు. ఆ తర్వాత కాంటా వేసినా మూడు, నాలుగు రోజులపాటు బస్తాలు కేంద్రంలోనే ఉంటున్నాయని, ధాన్యం మిల్లుకు తరలించేందుకు లారీలు రావడంలేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తూకం వేసినా మిల్లర్లు దిగుమతి చేసుకునేందుకు కొర్రీలు పెడుతున్నారని, పది కేజీలు తరుగు తీయాలంటున్నారని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ధాన్యాన్ని తిరస్కరిస్తూ లోడ్‌ను దిగుమతి చేసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అదునుగా దళారులు..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇక్కట్లు పడలేక రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు, దళారులు తక్కుకు ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కూడా కొంటున్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు మద్దతు ధర గ్రేడ్ ఏ రకానికి రూ.2,389, గ్రేడ్ బి రకానికి రూ.2,369 చొప్పున చెల్లిస్తోంది. వ్యాపారులు మాత్రం క్వింటాల్‌కు రూ.1400 నుంచి రూ. 1700 వరకే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాకు సుమారు రూ. 600 నుంచి రూ. 1000 వరకు నష్టపోవాల్సి వస్తోంది.
కొనుగోలు లక్ష్యం 87,209 మెట్రిక్ టన్నులు
జిల్లాలో యాసంగిలో రైతులు 85 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు 22 క్వింటాళ్ల చొప్పున 87,209 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 167 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
యార్డులో 3 వేల బస్తాల కాంటా పెట్టిన ధాన్యం..
డీఏఓ ఎదుట రైతులు, నిర్వాహకుల ఆవేదన
దమ్మపేట: కేంద్రంలో కాంటా పెట్టిన 3 వేల బస్తాల ధాన్యం ఉందని రైతులు, కేంద్రం నిర్వాహకులు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.బాబూరావు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దమ్మపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెండు రోజులుగా లారీలు రావడంలేదని తెలపగా, ఆయన జిల్లా పౌర సరఫరాల అధికారితో ఫోన్‌లో మాట్లాడి తక్షణమే మూడు లారీలను పంపాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని బాధ్యులను ఆదేశించారు. ఏడీఏ రవికుమార్, ఏఓ చంద్రశేఖర రెడ్డి, ఏఈఓ సతీష్, పోలారావు తదితరులు పాల్గొన్నారు.
మొక్కజొన్న బస్తాలతో నిండిన
పీఏసీఎస్ ప్రాంగణం
గుండాల: పీఏసీఎస్‌లో కొనుగోలు కేంద్రం మొక్కజొన్న బస్తాలతో నిండిపోయింది. లారీలు రాకపోవడంతో సరఫరా నిలిచిపోయింది. 20 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా, 6 వేల క్వింటాల మక్కలు కొన్నారు. కొన్నవి తరలించకపోవడంతో మిగతా రైతులకు కేంద్రంలో స్థలం లేకుండాపోయింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఈ ఏడాది యాసంగిలో సుమారు 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఇప్పటి వరకు 10,500 బస్తాలు కొనుగోలు చేయగా లారీలు రాకపోడంతో ప్రాంగణం నిండిపోయింది. దీంతో ఇంకా కొందరు రైతులు మక్కలు తెస్తున్నా, బస్తాలు దింపే స్థలం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. మరికొందరు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. గోదాంల వద్ద హమాలీల కొరతతో మొక్కజొన్న దిగుమతి కావడంలేదని, దీంతో లారీల కొరత ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు అకాల వరాల్షతో మొక్కజొన్నలు తడిసిపోతున్నాయి.
గత శనివారం వరకు 1000 మంది రైతుల నుంచి 8,500 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. లారీల కొరత లేదు. ఇటీవల వర్షాలు కురియడంతో కేంద్రాలకు లారీలు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. అయినా వెంటనే కేంద్రాలకు లారీలను పంపి నిర్దేశించిన మిల్లులకు ధాన్యం తరలిస్తున్నాం. తడిసిన ధాన్యం కూడా కొని మిల్లులకు పంపిస్తాం.
–త్రినాథ్‌బాబు,
పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ డీఎం
నేను యాసంగిలో 150 క్వింటాళ్ల ధాన్యం పండించాను. కేంద్రానికి 20 రోజుల క్రితం వడ్లు తెచ్చి ఆరబోసి ఉంచాను. మొన్న రాత్రి వర్షం వస్తే కంటిమీద కునుకులేదు. ధాన్యంపై కప్పిన పట్టాలు గాలికి ఎగిరిపోయాయి. సగం ధాన్యం తడిసింది.
–బానోతు శంకర్, రైతు, బిక్కుతండా


