15రోజుల పాటు ధాన్యం తరలింపునకే వినియోగం
రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం సహకారనగర్: ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటూ చివరి గింజ వరకు సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ఆయన ఖమ్మం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఏటా సీజన్‌లో బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి హమాలీలు వస్తారని, ప్రస్తుతం అక్కడి పరిస్థితుల కారణంగా వారు రాకపోవడంతో కొరత ఏర్పడిందన్నారు. దీనికి తోడు ఎండల కారణంగా హమాలీలు పగటి వేళ పనిచేయలేక పోతున్నారన్నారు. ఈమేరకు సమస్యను పరిష్కరించేందుకు గాను ఉమ్మడి జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు వేగంగా జరిగేలా రానున్న 15 రోజుల పాటు ఇసుక, సిమెంట్ తదితరాల రవాణాపై నియంత్రణ విధించి లారీలు, డీసీఎంలను ధాన్యం రవాణాకే వినియోగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొందరు మిల్లర్లు క్వింటాకు ఐదు, ఆరు కిలోల వరకు కోత విధిస్తున్నారనే సమాచారం ఉందని, ఇకనైనా వారు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.22 వేల కోట్లు కేటాయించగా, ఇప్పటికే 30 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతులకు రూ.4,800 కోట్లు జమ చేశామని తెలిపారు.
మిల్లులు సీజ్ చేస్తాం..
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం అవసరమైతే ప్రభుత్వం కొంత నష్టాన్ని భరించేందుకై నా సిద్ధంగా ఉందని వెల్లడించారు. రైతులు రికార్డు స్థాయిలో వరి సాగు చేయడంతో దిగుబడి కూడా అలాగే వచ్చిందన్నారు. ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని కోరారు. ఎక్కడైనా రైస్ మిల్లర్లు అక్రమంగా తరుగు తీసినట్లు తెలిస్తే మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఇంకా ఎవరేం అన్నారంటే....
● భద్రాద్రి కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో పంట కోత ఆలస్యంగా ప్రారంభమైనందున కొనుగోళ్లు ప్రస్తుతం వేగం పుంజుకుంటున్నాయని వెల్లడించారు.
● కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రైతులు ధాన్యం విక్రయంలో ఇబ్బంది పడకుండా అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో తాలు, తరుగు పేరుతో ఎలాంటి కోతలు విధించకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
● వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఖమ్మం సీపీ సునీల్‌దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డి.వేణుగోపాల్, భద్రాద్రి ఎస్పీ బి.రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్లు మ్రిణాల్ శ్రేష్ఠ, అజయ్‌యాదవ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


