భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
ఏబీ స్విచ్‌లతో మెరుగైన విద్యుత్ సరఫరా
ఎస్‌ఈ మహేందర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఏబీ స్విచ్‌ల ఏర్పాటుతో విద్యుత్ సరఫరా మెరుగుపడుతుందని టీజీ విద్యుత్ ఎస్‌ఈ గొట్టిముక్కుల మహేందర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వివరాలు వెల్లడించారు. సింగిల్ ఫేస్ లైన్లలో 561 ఏబీ స్విచ్‌లు, త్రీఫేస్ లైన్లలో 480 ఏబీ స్విచ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీని ద్వారా ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే లైన్ మొత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా, కేవలం సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మాత్రమే సరఫరా నిలిపివేస్తామని వివరించారు. మిగతా ప్రాంతాలకు సరఫరా ఉంటుందన్నారు. గతంలో చిన్న లైన్ ఫాల్ట్ వచ్చినా మొత్తం గ్రామం లేదా ఫీడర్ పరిధిలోని కాలనీలన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేదని అన్నారు. ఇక ఆ సమస్య ఉండదని తెలిపారు. అత్యవసర విద్యుత్ సమస్యలపై వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912లో సంప్రదించాలని కోరారు.
అబాస్ హాజరు
నమోదు చేయాలి
చుంచుపల్లి: అబాస్ (ఆధార్ ఆధారిత బయోమెట్రిక్) హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ వైద్యాధికారులకు సూచించారు. గురువారం నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశంలో మాట్లాడారు. నార్మల్ డెలివరీ మోటివేషన్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, గర్భిణులకు సాధారణ ప్రసవాలు ఎక్కువ శాతం అయ్యేలాగా యోగాసనాలు నేర్పించాలని ఆదేశించారు. గర్భిణులకు ఏఎన్‌సీ క్లినిక్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని, రక్తహీనత నివారణకు కృషి చేయాలని చెప్పారు. వైద్యాధికారుల అనుమతి లేకుండా సెలవులు తీసుకోవొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ప్రతాప్, రాకేష్, హరీష్, డిప్యూటీ డెమో నాగలక్ష్మి, సిబ్బంది రాంప్రసాద్, లీల, జానకి పాల్గొన్నారు.
నేడు గ్రంథాలయ దినోత్సవం
కొత్తగూడెంఅర్బన్: విద్యా వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవం నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘మారుతున్న సమాజంలో గ్రంథాలయాల అభివృద్ధి–వాటి ప్రయోజనాలు’అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏడో తరగతి నుంచి డిగ్రీ చదివే విద్యార్థులెవరైనా పోటీల్లో పాల్గొనచ్చని, ఉదయం 10:30 గంటలకు గ్రంథాలయానికి రావాలని సూచించారు. పుస్తక ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు.
రైతులు ఇబ్బంది పడకుండా మక్కల కొనుగోళ్లు
కూసుమంచి: రైతులు పండించిన మొక్కజొన్నలు మొత్తం కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ గోపి తెలిపారు. కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టడమే కాకుండా గోదాంలకు తరలిస్తామని వెల్లడించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్కల కాంటా పూర్తయి రోజులు గడుస్తున్నా గోదాములకు తరలించడం లేదని, ఫలితంగా వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వివరించారు. దీంతో హమాలీల సంఖ్య పెంచడంతో పాటు రవాణాకు సరిపడా వాహనాలు సమకూర్చాలని డైరెక్టర్ అధికారులకు సూచించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఏడీఏ సతీష్, ఏఓ వాణి తదితరులు పాల్గొన్నారు.


