భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో విద్యార్ధులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి గురువారం ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ రెండు జిల్లాల నుంచి 621 దరఖాస్తులు అందగా, తల్లిదండ్రుల సమక్షాన పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. ఇందులో ఎవరైనా విద్యార్థులు చేరకపోతే వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి అవకాశం ఇస్తామని చెప్పారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ అశోక్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, సీఓఈ కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి, ఉద్యోగులు రమేష్, రాములు, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.
18నుంచి కేంద్ర పథకాలపై అవగాహన
ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్త్కర్ష అభియాన్ తదితర కేంద్ర పథకాల పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఈనెల 18నుంచి 25వరకు అవగాహన సదస్సులు నిర్వహించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ సెక్రటరీ సమిదా సింగ్ సూచించారు. న్యూఢిల్లీ నుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం నుంచి పీఓ రాహుల్ మాట్లాడుతూ గొత్తికోయలు, గిరిజన కుటుంబాలకు పథకాలపై అవగాహన కల్పించడమే కాక ఆధార్ నమోదు, జీవనోపాధి పథకాల మంజూరుకు క్యాంపులు ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఏపీఓ డేవిడ్‌రాజ్, అధికారులు గన్యానాయక్, పాయం శ్రీనివాసరావు పాల్గొన్నారు.


