ఇల్లెందు: దేశ వ్యాప్తంగా రైతుల పాత రుణాలు రద్దు చేయాలని, వడ్డీ లేని రుణాలు అందజేయాలని, సాగుకు సమగ్ర ఖర్చుల ప్రాతిపదికన కనీస మద్దతు ధరలను నిర్ణయించి గ్యారంటీ చట్టాన్ని చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు విమల్ త్రివేది, కిచ్చెల రంగయ్య డిమాండ్ చేశారు. గురువారం ఇల్లెందులోని చండ్ర కిష్ణమూర్తి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాసభల తీర్మానాలను వెల్లడించారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. 2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు లోపభూయిష్టంగా ఉన్నాయని, కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లు తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. కల్తీ లేని విత్తనాలు సరఫరా చేయాలని, రబీలో తడిచిన మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించాలని, ఆదివాసీలపై అక్రమ కేసులను రద్దు చేయాలని కోరారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్, వెనిజుల, క్యూబా ఇతర దేశాలపై దాడులను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, చండ్ర అరుణ, అమర్లపూడి రాము, బుర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


