బూర్గంపాడు: ఈ నెల 12వ తేదీన లక్ష్మీపురం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మంగళవారం లక్ష్మీపురం ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ(62)ను వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. వెంటనే అతడిని భద్రాచలం అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించగా.. అక్కడ చికిత్సలు పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ నాగరాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మేడ ప్రసాద్ తెలిపారు.
ములకలపల్లి: రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం మేరకు.. పాల్వంచ వికలాంగుల కాలనీకి చెందిన తుంపూరి కల్యాణ్ (35) బుధవారం బైక్‌పై సత్తుపల్లి వెళ్లి గురువారం తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో పాలవాగు శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన కల్యాణ్‌ను పాల్పంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.


