‘చేయూత’లో అనర్హులకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’లో అనర్హులకు చెక్‌

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

● నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న అధికారులు ● ఫేషియల్‌ రికగ్నైషన్‌ యాప్‌లో వివరాలు నమోదు

● నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్న అధికారులు ● ఫేషియల్‌ రికగ్నైషన్‌ యాప్‌లో వివరాలు నమోదు

చుంచుపల్లి: చేయూత పథకంలో పింఛన్‌ పొందుతున్న అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం నేటి నుంచి సర్వే చేపట్టనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వితంతువులు, హెచ్‌ఐవీ, పైలేరియా బాధితులు, డయాలసిస్‌ బాధితులు ఇలా 10 రకాలుగా సర్కారు పింఛన్లు అందిస్తోంది. ఇందుకు ఆధార్‌, రేషన్‌ కార్డు ప్రామాణికంగా పాటిస్తోంది. ఈ క్రమంలోనే 2018 వరకు రేషన్‌ కార్డు అర్హత ఉండగా, తర్వాత దశల వారీగా ఆధార్‌ లింక్‌ చేయడంతో జిల్లాలో పింఛన్లలో అక్రమాలు బయటపడ్డాయి. మృతుల జాబితా కూడా తొలగించకపోవడంతో వారి పేరిట కూడా పింఛన్లను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించేందుకు ఈ నెల 15 నుంచి జూన్‌ 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం నుంచి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు,మున్సిపల్‌ వార్డుల్లో అధికారులు బిల్‌ కలెక్టర్లు ఇతర సిబ్బంది జాబితాలతో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించనున్నారు. పింఛన్‌ పొందే లబ్ధిదారుడి ముఖ గుర్తింపు(ఫేషియల్‌ రికగ్నైషన్‌) యాప్‌లో వివరాలు నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం జీవించి ఉంటే లైవ్‌నెస్‌ అథెంటికేషన్‌ కింద నమోదు చేస్తారు. ఒకవేళ వ్యక్తి చనిపోతే వివరాలు నమోదు చేసుకుంటారు. గ్రామసభను నిర్వహించి ఆమోదం పొందిన తర్వాత మృతుల పేర్లు తొలగించనున్నారు. సర్వేపై కలెక్టరేట్‌లో గురువారం పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులకు శిక్షణ ఇచ్చారు.

జిల్లాలో 1.13 లక్షల మందికి పింఛన్లు

జిల్లా వ్యాప్తంగా 1,13,840 మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో వృద్ధాప్య ఫించన్లు 42,820 మంది, దివ్యాంగులు 13,101 మంది, వితంతువులు 49,369 మంది, చేనేత కార్మికులు 16 మంది, గీత కార్మికులు 141 మంది, ఒంటరి మహిళలు 6,150 మంది, బీడీ కార్మికులు 4 మంది, పైలేరియా బాధితులు 159 మంది, ఏఆర్‌టీ బాధితులు 1791 మంది, డయాలసిస్‌ బాధితులు 249 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో వృద్ధులకు రూ.2,016 చొప్పున, దివ్యాంగులకు రూ.4,016 పింఛన్‌ ఇస్తోంది. కాగా సర్వే పారదర్శకంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని, చనిపోయిన వారు, అనర్హులను గుర్తించి మేరకు తొలగిస్తామని డీఆర్‌డీఓ విద్యాచందన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement