నాణ్యత లోపిస్తే ఏజెన్సీ రద్దు | - | Sakshi
Sakshi News home page

నాణ్యత లోపిస్తే ఏజెన్సీ రద్దు

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలంలోని భద్రగిరి మార్ట్‌కు సరఫరా అవుతున్న ‘మిల్లెట్‌ మ్యాజిక్‌’బిస్కెట్ల తయారీలో నాణ్యత లోపిస్తే ఏజెన్సీని రద్దు చేస్తామని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌ రాజ్‌ హెచ్చరించారు. ఐటీడీఏ ప్రాంగణంలోని కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మహిళలు బిస్కెట్లు తయారు చేస్తున్న విధానాన్ని, ముడి సరుకులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో ఈ బిస్కెట్లకు మంచి డిమాండ్‌ ఉన్నందున నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, బెల్లం, కల్తీ లేని ముడి సరుకులు మాత్రమే వాడాలని స్పష్టం చేశారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీవీటీజీ అధికారి గన్యా, మహిళా సభ్యులు వెంకటలక్ష్మి, లలిత, సమ్మక్క, మంగవేణి పాల్గొన్నారు.

‘అన్నం’ చెంతకు

మతిస్థిమితం లేని మహిళ

సుజాతనగర్‌: గత 10 రోజులుగా సుజాతనగర్‌లో తిరుగుతున్న మతి స్థిమితం లేని మహిళకు సీ్త్రశిశు సంక్షేమ శాఖ, సఖీ ఆధ్వర్యాన గురువారం చేయూత కల్పించారు. ఓ మహిళ గత కొన్ని రోజులుగా సుజాతనగర్‌లో దిగంబరిగా సంచరిస్తుండగా.. సుజాతనగర్‌కు చెందిన ఓ వ్యక్తి విషయాన్ని సఖీ కేంద్రానికి తెలియజేశాడు. దీంతో జిల్లా సంక్షేమాధికారిణి సహకారంతో సదరు మహిళకు దుస్తులు, భోజనం అందజేశాక ఖమ్మం అన్నం ఫౌండేషన్‌ వారిని పిలిపించి ఆమెను అప్పగించారు.

రేపు జాబ్‌ మేళా

పాల్వంచరూరల్‌/రుద్రంపూర్‌: మండల పరిధి లక్ష్మీదేవిపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 16న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అపోలో ఫార్మసీలో 100, శ్రీరాం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలో 20 పోస్టుల భర్తీకీ ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement