కల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన ముఠాను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు ఖమ్మం జిల్లా కల్లూరులో గురువారం ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. ఎస్సై డి.హరిత సిబ్బందితో కలిసి బుధవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరం మండలం ఓబులపాలెంకు చెందిన బోలుసు ఏసుబాబు అలియాస్ మానికల ఏసుబాబు, ఎన్‌టీఆర్ జిల్లా చాట్రాయి మండలం కోటపాడుకు చెందిన చేవూరి ఆదినారాయణ, వేంసూరు మండలం ఎర్రగుంటపాడుకు చెందిన తుమ్మల మురళితో పాటు మరో వ్యక్తి రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిని వెంబడించి అదుపులోకి తీసుకున్నాక వేలిముద్రల ఆధారంగా పరిశీలించాక ఇద్దరి వేలిముద్రలు డేటాబేస్‌లో పాత నేరుస్తులతో మ్యాచ్ అయ్యాయి. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దు కల్లూరు మండలం చెన్నూరు, చిన్నకోరుకొండి, తల్లాడ మండలం వెంకటగిరి, మధిర మండలంలోని మల్లారం, ఏపీలో విసన్నపేట ఆంజనేయస్వామి దేవాలయం, పెనుబల్లి పోస్టాఫీసులో చోరీ చేసినట్లు తేలడంతో రిమాండ్‌కు తరలించారు. నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్‌ఐ హరిత, సిబ్బందిని నాగేంద్రబాబు, సత్యనారాయణ, నరసింహారావును ఏసీపీ వసుంధర అభినందించారు.


