ఏమిటీ కోల్ గ్యాసిఫికేషన్?
ప్లాంట్ నిర్మాణ వ్యయంలో
20 శాతం సర్దుబాటు
2006లోనే దృష్టి సారించిన సింగరేణి
అయినా ఇప్పటివరకు
కానరాని పురోగతి
ఇరవై ఏళ్ల క్రితమే...
కొత్త పథకం
ఇరాన్ – అమెరికా యుద్ధంతో ప్రపంచ వాణిజ్య రంగంలో పరిస్థితులు మారిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల దిగుమతి కష్టంగా మారింది. ప్రజలు పొదుపు చర్యలు పాటించాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇంధన కొరతతో భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా విస్తారంగా ఉన్న బొగ్గు నిక్షేపాల నుంచి గ్యాస్‌ను వెలికితీయాలని నిర్ణయించారు. ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు రూ.37వేల కోట్ల ప్రోత్సాహకాలు అందిస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా ఉన్న కోలిండియా, సింగరేణి వంటి సంస్థలకు కొత్త అవకాశం లభించినట్లయింది.
20 శాతం సాయం
ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన పథకం ద్వారా కోల్ గ్యాసిఫికేషన్‌లో పాల్గొనే ప్రభుత్వ రంగ సంస్థలకు మొత్తం పెట్టుబడిలో 20 శాతాన్ని సమకూరుస్తుంది. అలాగే, ఈ రంగంలో అనుభవం కలిగిన ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి సాంకేతిక సహకారం కూడా అందేలా తోడ్పాటునిస్తుంది. ఇప్పటికే కోలిండియా కోల్ గ్యాసిఫికేషన్ విషయంలో ప్రాథమిక పనుల్లో పురోగతి సాధించింది. ఇప్పటికై నా సింగరేణి మీనమేషాలు లెక్కించడం ఆపేసి రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మూతపడిన రెండు అంతకంటే ఎక్కువ గనులను ఒక్కటిగా చూసి, మిగిలిన బొగ్గును వెలికి తీసే పనిలోనే నిమగ్నమైంది. దీనికి అదనంగా కోల్ గ్యాసిఫికేషన్‌ను కూడా జత పరిస్తే మేలు జరగడం ఖాయమని చెబుతున్నారు.
భూమి పొరల్లో నిక్షిప్తమైన బొగ్గును ఉపరితల, భూగర్భ గనుల ద్వారా వెలికి తీస్తున్నారు. ఈ బొగ్గును ప్రధానంగా థర్మల్ విద్యుత్, సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. అయితే, బొగ్గును నేల నుంచి బయటకు తీసి, తర్వాత పరిశ్రమల్లో మండించడం కంటే భూమి పొరల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడే బయటి నుంచి ఆక్సిజన్ ఇతర వాయువులను పంపడం ద్వారా మండించి సింథటిక్ గ్యాస్‌ను తయారు చేసే ప్రక్రియనే కోల్ గ్యాసిఫికేషన్ అంటారు. ఈ సింథటిక్ గ్యాస్‌ను బయటకు తీసుకొచ్చి ప్రాసెస్ చేస్తే నేచురల్ గ్యాస్, మిథనాల్, అమ్మోనియా తదితర ఉత్పత్తులను పొందవచ్చు. ఇందులో నేచురల్ గ్యాస్ పారిశ్రామిక అవసరాలకు, అమ్మోనియా ఎరువుల తయారీలో దిగుమతులు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. పైగా సంప్రదాయ మైనింగ్‌తో పోలిస్తే కోల్ గ్యాసిఫికేషన్ ప్రక్రియలో కాలుష్యం కూడా తక్కువగా వెలువడుతుంది.
కోల్ గ్యాసిఫికేషన్‌కు రూ.37వేల కోట్లు కేటాయించిన కేంద్రం
సంస్థలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని, మరో విడత గోల్డెన్‌షేక్ హ్యాండ్ పథకం అమలు చేస్తారనే ప్రచారం సింగరేణిలో జరగుతోంది. దీనికి విరుగుడుగా కొత్త రంగాల్లోకి విస్తరిస్తే కార్మికుల సర్దుబాటుకు అవకాశముంది. అంతేకాక సంస్థ భవిష్యత్‌కు భరోసా లభిస్తుందని కార్మికులు అంటున్నారు. ఈనేపథ్యాన తగిన వేదికను కేంద్రం సిద్ధం చేస్తోంది.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
బొగ్గు ఉత్పత్తిలో సింగరేణికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. సాంకేతిక పరిజ్ఞానం అంతంతగా ఉన్న సమయాన అనేక గనుల్లో బొగ్గు వెలికితీయలేక వదిలేశారు. ఇలా వదిలేసిన బొగ్గును ‘కోల్ గ్యాసిఫికేషన్’ ద్వారా వినియోగంలోకి తేవాలని సింగరేణి సంస్థ 2006లో ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు సాంకేతిక సహకారం కోసం ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)తో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు సింగరేణి సీఎండీ హోదాలో ఖ్వాజా, ఓఎన్‌జీసీ నుంచి డైరెక్టర్(ఆపరేషన్స్) హోదాలో పి.వాసుదేవరావులు సంతకాలు చేశారు. కానీ ఇప్పటివరకు అడపాదడపా కోల్ గ్యాసిఫికేషన్ అంటూ హడావుడి తప్పితే ఎలాంటి పురోగతి సాధించలేదు.


