● యథేచ్ఛగా సిలిండర్ల సరఫరా ● ఫలితంగా స్థానిక అవసరాలకు కొరత
భద్రాచలం: సామాన్య ప్రజలకు గ్యాస్ కష్టాలు తీరడం లేదు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. డీలర్లతో మిలాఖత్ అయినట్లు తెలుస్తుండగా.. బ్లాక్ మార్కెట్ దందా అటు డీలర్లు, ఇటు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా డీలర్లు సిలిండర్లను స్థానికంగా బ్లాక్‌లో అమ్మడమే కాక సరిహద్దు దాటిస్తున్నారు.
పరిధి దాటి...
నిబంధనల ప్రకారం డీలర్లు నిర్దేశిత పరిధిలోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలి. కానీ కృత్రిమ కొరతలో భాగంగా అడ్డదారిన దండుకోవడానికి కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. భద్రాచలానికి సరిహద్దుగా రెండు వైపులా ఆంధ్రప్రదేశ్ ఉండడం వీరికి కలిసొస్తోంది. అక్కడ కొన్ని గ్రామాల ఏజెన్సీలకు భద్రాచలం నుంచే సిలిండర్లు తరలిస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా భద్రాచలం వాసులకు సరైన సమయంలో గ్యాస్ అందటం లేదు. బుక్ చేసుకుని చాలా రోజులకు కూడా సిలిండర్లు సరఫరా కాక కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ వ్యవధిలో బ్లాక్ మార్కెట్ ద్వారా రెట్టింపు ధరతో అమ్ముతూ ఆదాయాన్ని గడిస్తున్నారు. అంతేకాక గృహావసరాల సిలిండర్లను కమర్షియల్ సిలిండర్లలోకి మార్చి మరింత ఎక్కువ ధరతో అమ్ముకుంటున్నట్లు తెలిసింది.
అధికారులకు కనిపించడం లేదా?
బ్లాక్ మార్కెట్ కారణంగా సిలిండర్ల ధర పెంపుతో సామాన్యులు ఇబ్బంది పడుతుండగా.. పరిస్థితులను చక్కదిద్దాల్సిన పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. గత రెండు నెలలుగా సమస్య కొనసాగుతున్నా ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. డీలర్లకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో వారి బ్లాక్ మార్కెట్ దందా నానాటికీ పెరుగుతోందని వినియోగదారులు వాపోతున్నారు. ఈ సమస్యపై హోటల్ల అసోసియేషన్ ద్వారా విన్నవించినా తమ దృష్టికి రాలేదని ఉద్యోగులు చెబుతుండడంపై వారి తీరుకు అద్దం పడుతోంది. ఇటీవల మణుగూరులో డీలర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో అక్కడి బాధ్యతలు మరో ఏజెన్సీకి మార్చి సమస్యను పరిష్కరించారు. కానీ భద్రాచలం ఏరియాలో తనిఖీ కూడా చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కలెక్టర్ దృష్టి సారిస్తేనే..
పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నందున కలెక్టర్ అంకిత్ ఈ సమస్యపై దృష్టి సారించాలని గ్యాస్ వినియోగదారులు కోరుతున్నారు. కలెక్టర్‌గా విధుల్లో చేరినప్పటి నుంచి అంకిత్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తూ పాలనను చక్కదిద్దుతున్నారు. ఈమేరకు టెంపుల్ సిటీగా పేరున్న భద్రాచలంలో గ్యాస్ సమస్యపై దృష్టి సారించి స్థానికులు, భక్తుల ఇక్కట్లు తీర్చాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.


