కనులపండువగా కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా కల్యాణం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించాక పెద్దసంఖ్యలో పాల్గొన్న భక్తుల సమక్షాన నిత్య కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు జరిపారు. అలాగే, బేడా మండపంలో స్వామికి స్నపన తిరుమంజనం గావించారు.

ప్రశాంతంగా పాలిసెట్‌

రుద్రంపూర్‌: పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు బుధవారం నిర్వహించిన పాలిసెట్‌ జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఐదు, సుజాతనగర్‌, పాల్వంచలో రెండు కలిపి ఐదు సెంటర్లు ఏర్పాటుచేశారు. ఈమేరకు ఏడు సెంటర్లలో 2,069 మంది విద్యార్థులకు గాను 153 గైర్హాజరు కాగా 1,916 మంది పరీక్ష రాశారు. అలాగే, మణుగూరు సెంటర్‌లో 675 మందికి 633, భద్రాచలం సెంటర్‌లో 746 మందికి 698 హాజరయ్యారు. పలు కేంద్రాల్లో ఉన్నతాధికారులు పరీక్ష నిర్వహణను పరిశీలించారు.

ప్రారంభమైన ఇంటర్‌

సప్లిమెంటరీ పరీక్షలు

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు బుధవారం మొదలయ్యాయి. ఉదయం పరీక్ష(జనరల్‌)కు 1,540 మంది విద్యార్థుల్లో 1,462 మంది, ఒకేషనల్‌ గ్రూప్‌నకు సంబంధించి 181 మందిలో 160 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌కు జనరల్‌ గ్రూప్‌ నుంచి 391 మందిలో 369 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 40 మందికి 32 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలోని 26 పరీక్ష కేంద్రాల్లో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీ చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement