నేడు ఉద్యాన కళాశాల ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

నేడు ఉద్యాన కళాశాల ప్రారంభం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

అశ్వారావుపేట: అశ్వారావుపేటకు ప్రభుత్వం తాజాగా మంజూరుచేసిన ఉద్యాన కళాశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించనున్నారని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. స్థానిక ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు అశ్వారావుపేటకు ఉద్యాన కళాశాలను సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే 30 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభం కానుండగా, శాశ్వత భవనం, హాస్టల్‌, తదితర అవసరాలకు భూమిని గుర్తించామని చెప్పారు. కళాశాల ప్రారంభం అనంతరం ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ ఆవరణలో ఆయిల్‌పామ్‌ రైతుల ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా 2వేల మంది రైతులు హాజరవుతారని తెలిపారు. ఆయిల్‌ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు బండి భాస్కర్‌, జూపల్లి ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యపై ఇంత నిర్లక్ష్యమా?

ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్‌లకు విద్యారంగంపై పట్టనట్టు వ్యవహరించడం సరికాదని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. విద్యా వారోత్సవాల్లో సర్పంచ్‌లను భాగస్వాములను చేస్తూ బుధవారం రైతు వేదికలో శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణకు ఎమ్మెల్యే హాజరుకాగా.. నియోజకవర్గంలోని 105 మంది సర్పంచ్‌లకు కేవలం ఐదుగురే రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు తానూ ఉపాధ్యాయుడిగా పనిచేశానని, అప్పట్లో లేని కొత్త విధానాలు ప్రస్తుతం అమలవుతున్నందున సర్పంచ్‌లు వారి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కృషి చేయాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement