● బస్తాలు, హమాలీల కొరత లేకుండా చూడాలి ● కొనుగోలు కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ అంకిత్
ఇల్లెందురూరల్/టేకులపల్లి: రైతులు ఇబ్బంది పడకుండా మొక్కజొన్న కొనుగోళ్ల వేగవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. ఇల్లెందు మండలంలోని మార్కెట్‌యార్డు, రేపల్లెవాడతో పాటు టేకులపల్లి, బోడు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన కొనుగోళ్లు, ఎగుమతి వివరాలతో పాటు కేంద్రాల్లో నిల్వ ఉన్న పంట వివరాలు ఆరా తీశారు. కాగా, ఇల్లెందులో మొక్కజొన్న నిల్వకు గోదాములు గుర్తించారా అని తహసీల్దార్ సూర్యనారాయణను ప్రశ్నించగా సమాధానం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సూచన మేరకు మండలంలోని సుభాష్‌నగర్‌లో గిరిజన భవన్‌ను ఉపయోగించుకోవాలని, అవసరమైతే కారేపల్లికి తరలించాలని సూచించారు. అంతేకాక అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని ఆర్డీఓ మధును, ఇల్లెందుకు లారీల సంఖ్య పెంచాలని రవాణా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఇక టేకులపల్లి నుంచి మక్కలను సూర్యాపేట జిల్లా కోదాడ మార్కెట్ యార్డుకు తరలిస్తున్నట్లు చెప్పిన అధికారులు, ప్రత్యామ్నాయంగా టేకులపల్లి ఉన్నత పాఠశాలను వినియోగించుకుంటున్నామని తెలిపారు. అయితే, పెట్రాంచెలకలోని గోదాంలో నిల్వకు అనుమతి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఇల్లెందు మార్కెట్, పీఏసీఎస్‌ల చైర్మన్లు బానోత్ రాంబాబు, మెట్టెల కృష్ణ, లక్కినేని సురేందర్‌రావు, డీఏఓ బాబూరావు, మార్కెటింగ్ అధికారి నరేందర్, తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ జేఎల్.గణేష్ గాంధీ, సర్పంచ్ బానోత్ శారద, ఏడీఏ లాల్‌చంద్, ఏఓలు సతీష్, అన్నపూర్ణ, సీఈఓలు హీరాలాల్, ప్రేమాచారి పాల్గొన్నారు.


