కూసుమంచి: ‘ఇది ప్రజల ప్రభుత్వం.. యంత్రాంగమే మీ ముందుకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తోంది.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత తీసుకుంటున్నందున ధైర్యంగా ఉండాలి’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన ఖమ్మం కలెక్టర్ దివాకరతో కలిసి ప్రజల నుంచి వినతులు, దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు పాలేరు నియోజకవర్గంలో ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండగా, మిగిలిన వాటిని మూడు నెలల్లో పరిష్కరించడమే లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రాష్ట్రంలోని పేదలందరికీ గూడు సమకూర్చాలనే భావనతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే రెండో విడత ఇళ్ల మంజూరు ఉంటుందని తెలిపారు. రైతుల భూసమస్యల పరిష్కారం కోసం భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. పాలేరు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించి రంగాల్లో అభివృద్ది చేయడమే తన లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా దర్బార్‌లో
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


