కొత్తగూడెంఅర్బన్: బక్రీద్ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ సీ.వీ.ఆనంద్ సూచించారు. హైదరాబాద్ నుంచి బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో, పరస్పర సహకారంతో జరుపుకునేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాటు, పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపుపై సూచనలు చేశారు. అలాగే, సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై నిఘా వేయాలని తెలిపారు. ఈ వీసీలో జిల్లా నుంచి ఎస్పీ రోహిత్‌రాజ్ మాట్లాడుతూ జిల్లాలో బందోబస్తు, కంట్రోల్ రూంల ఏర్పాటు, తనిఖీలతో పాటు ముందస్తుగా నిర్వహించిన సమావేశాల వివరాలను వెల్లడించారు.ఎస్పీతో పాటు డీఎస్పీలు ఆదినారాయణ, రవీందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, సీఐలు శ్రీనివాస్, సీఐ సతీష్ పాల్గొన్నారు.


