ఇంటికే పౌష్టికాహారం | - | Sakshi
Sakshi News home page

ఇంటికే పౌష్టికాహారం

May 14 2026 12:31 AM | Updated on May 14 2026 12:31 AM

● లబ్ధిదారుల గృహం వద్దకే సరుకులు ● వేసవి సెలవుల్లో కూడా పోషకాహారం పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

సరుకులు అందించడానికి చర్యలు

● లబ్ధిదారుల గృహం వద్దకే సరుకులు ● వేసవి సెలవుల్లో కూడా పోషకాహారం పంపిణీ ● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

భద్రాచలంఅర్బన్‌: ప్రాథమిక, జిల్లా ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు సైతం మే 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో సెలవుల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, సరుకులు ఇంటికే సరఫరా చేస్తున్నారు. బియ్యం, పప్పులు, పాలు, గుడ్లు, పల్లీపట్టీలు, మురుకులు, మిల్లెట్స్‌, బాలామృతం అందిస్తారు. అలాగే నెల రోజులపాటు వారి ఆరోగ్యంపై అంగన్వాడీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. వేసవి కారణంగా పౌష్టికాహారం కోసం లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదు. దీంతో ఆహార సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పరిస్థితులను బట్టి నేరుగా పౌష్టికాహారం అందించే విధానం అమల్లోకి తెచ్చింది.

లబ్ధిదారులకు ఊరట..

మే నెలలో ఎండల తీవ్రత కారణంగా గర్భిణులు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోవడంతో పౌష్టికాహారం అందడం ఆగిపోయేది. లబ్ధిదారులు, పిల్లలకు సెలవులు వర్తిస్తాయి. ఈ సమయంలో టేక్‌ హోం రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) అమలు చేసింది. ఆరేళ్లలోపు చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు బియ్యం, పప్పు, నూనె, పాలు బాలామృతం, కోడిగుడ్లు వంటి సరుకులు అందిస్తున్నారు. పూర్వ ప్రాథమిక విద్యార్థులకు సెలవులు వర్తిస్తాయి. విధుల్లో ఉన్న సిబ్బంది టీహెచ్‌ఆర్‌ పంపిణీ అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి పూర్వ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులను చేర్చించడం, పిల్లల ఎత్తు, బరువు చూడటం, బడి పిల్లలను గుర్తించడం వంటి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ నిర్ణయంతో అంగన్వాడీ నిర్వాహకులతోపాటు లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

పౌష్టికాహారం సరఫరా ఇలా..

జిల్లాలో ఉన్న ఐసీడీఎస్‌ పరిధిలో 2,061 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాల నుంచి 9,070 మంది గర్భిణులు, 3,543 మంది బాలింతలు, 3 ఏళ్ల లోపు 35,036 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకు 32,667 మంది చిన్నారులు పౌష్టికాహారం పొందుతున్నారు. రోజూ భోజనం, గుడ్డు, పాలు, స్నాక్స్‌ అందించాల్సి ఉంటుంది.

సవాళ్లు, పర్యవేక్షణ అవసరం..

కొందరు లబ్ధిదారులు కేంద్రాలకు రాకపోవడం, టీచర్లు/ఆయాలు పంపిణీలో నిర్లక్ష్యం చేస్తే ప్రభు త్వ లక్ష్యం నెరవేరకపోవచ్చు. ఈ నేపథ్యంలో, జిల్లా ఉన్నతాధికారులు కఠిన పర్యవేక్షణతో పౌష్టికాహా రం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గృహాల సందర్శన..

వేసవి సెలవులైనా బాలింతలు, గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంగన్వాడీ సిబ్బంది గృహ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే సమాచారం తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగా లేకుంటే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తారు. చిన్నారుల బరువు, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, పోషణపై అవగాహన కల్పిస్తారు.

సెలవుల అనంతరం

‘అంగన్వాడీ బాట’

వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా కొనసాగుతాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాలు చేపడతారు. కేంద్రాల్లో ఐదేళ్ల వారు ఉంటే వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. అలాగే చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చుకోవడానికి ‘అమ్మమాట – అంగన్వాడీ బడిబాట’కార్యక్రమం ద్వారా గుర్తిస్తారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి సెంటర్లలో చేర్పిస్తారు.

అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవు లు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులకు అవసరమైన సేవలు నిలిపివేయకుండా యథావిధిగా కొనసాగించనున్నాం. లబ్ధిదారులకు సరుకులు ఇంటికే అందించడానికి చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వం నుంచి వచ్చే పౌష్టికాహారం నేరు గా వారి ఇళ్ల వద్ద అందిస్తాం. గృహ సందర్శన కార్యక్రమం ద్వారా వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తాం.

–ఉండేటి జ్యోతి,

ఐసీడీఎస్‌ సీడీపీఓ, దుమ్ముగూడెం ప్రాజెక్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement