దర్యాప్తు చేపట్టిన పోలీసులు
పాల్వంచ: పాల్వంచలో బుధవా రం అత్యంత అమానవీయ ఘటన వెలుగు చూసింది. పాల్వంచలోని బొల్లేరుగూడెం ప్రాంతంలో ఓ పసికందు తలభాగం లభ్యమవడం కలకలం రేపింది. వీధి కుక్కలు గుంపుగా చేరి అరుస్తుండడంతో స్థానికులు పరిశీలించగా పసికందు తలభాగాన్ని తింటున్నట్లు తేలింది. దీంతో కుక్కలను తరిమివేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పసికందు తలభాగాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఎవరైనా శిశువును చంపి ఇక్కడ పడేశారా, లేక మృతదేహాన్ని కుక్కలు శ్మశానం నుంచి తీసుకొచ్చాయా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. స్థానికంగా ప్రసవించిన మహిళల వివరాలతో పాటు ఆస్పత్రుల్లో బాలింతల వివరాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే, పసికందు మృతదేహం కుక్కల బారిన పడడంతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషయమై ఎస్‌ఐ నాగరాజును వివరణ కోరగా పసికందు వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని తెలిపారు.
అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు
చర్ల: ఓ మహిళతో అసభ్యంగా వ్యవహరించిన కేసులో మండలంలోని కొత్తపల్లికి చెందిన లంజిపల్లి వెంకటేశ్వర్లుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ భద్రాచలం అడిషినల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.దుర్గాభవాని బుధవారం తీర్పు వెలువరించారు. 2015లో చర్ల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ శ్రీనివాస్ వాదనలు వినిపించగా, అప్పటి చర్ల ఎస్‌ఐ, ప్రస్తుత ములుగు డీఎస్‌పీ ఎన్.రవీందర్ విచారణాధికారిగా కొనసాగారు. కోర్టు కానిస్టేబుల్‌గా వి.అయ్యప్ప వ్యవహరించారు.
పశువుల స్వాధీనం
చండ్రుగొండ: ఒడిశా రాష్ట్రం నవరంగ్‌పూర్ నుంచి హైదరాబాద్ కబేళాకు తరలించేందుకు 122 పశువులను చండ్రుగొండ మండలంలోని మహ్మద్‌నగర్‌లో ఉంచగా.. సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. పశువులను పాల్వంచ గోశాలకు తరలించామని, లారీని సీజ్ చేశామని, పలువురిని ఆదుపులో తీసుకుని విచారిస్తున్న ఎస్‌ఐ శివరామకృష్ణ వెల్లడించారు.


