మణుగూరురూరల్: గత ఫిబ్రవరి 2న విజయవాడలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో పలు దేశాలకు చెందిన రెండు వేల మంది కీబోర్డ్ వాయిద్య కళాకారులు ఏకకాలంలో ప్రదర్శన ఇచ్చారు. ఇది గిన్నిస్ రికార్డు సాధించగా పాల్గొన్న కళాకారులకు ధ్రువపత్రాలు అందజేశారు. వీరిలో మణుగూరు మండలానికి చెందిన, మాంటిస్సోరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని శ్రుతిప్రియ కూడా మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టీన్ దండంగి చేతుల మీదుగా ధ్రువపత్రం అందుకుంది.
ముగిసిన
ఎన్‌సీసీ శిక్షణ శిబిరం
టేకులపల్లి: యువతను క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టేకులపల్లిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన 11వ తెలంగాణ బెటాలియన్ ఎన్‌సీసీ శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. కల్నల్ సంజయ్‌కుమార్‌భద్ర పర్యవేక్షణలో జరిగిన 10 రోజుల శిబిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 700 మంది కేడెట్లు పలు అంశాల్లో నిష్ణాతులైన అధికారుల నుంచి శిక్షణ పొందారు. ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి కల్నల్ సంజయ్‌కుమార్‌భద్ర మాట్లాడుతూ.. ఎస్‌సీసీ శిక్షణ వ్యక్తిత్వ వికాసానికి పునాది అని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణ, ఉపేందర్‌నాయక్, శ్రీలత, బాల్‌బహదూర్ పున్, నారాయన్, సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రాజేందర్ పాల్గొన్నారు.
పీజీ నాలుగో సెమిస్టర్
పరీక్షలు నిరవధిక వాయిదా
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబా ద్ జిల్లాలో ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల పరీక్షలను నిరవధికంగా వాయి దా వేసినట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం తెలిపారు. పీజీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఈ నెల 11న కొందరు విద్యార్థులు ఆందోళన చేశారు. ఈ నేపథ్యాన మంగళవారం సాయంత్రం విద్యార్థులతో సమావేశం కాగా, పోటీ పరీక్షలు ఉండడమే కాక ఎండల కారణంగా పరీక్షలు వాయి దా వేయాలని పట్టుబట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాక నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించామని, ఈ నెల 13న మధ్యాహ్న భోజనం తర్వాత యూనివర్సిటీలోని హాస్టళ్లు, మెస్‌లను మూసివేస్తారని వెల్లడించారు. జూన్ 8న వేసవి సెలవులు ముగిశాక సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.


