రైతు ఉద్యమాలు నిర్మించాలి
ఇల్లెందు: ప్రభుత్వ నిరంకుశ విధానాలతో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలోకి చేజారిపోయిందని, రైతులను ఐక్యం చేసి బలమైన ఉద్యమాలు నిర్మించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. మంగళవారం ఇల్లెందులోని ఐతా ఫంక్షన్ హాల్‌లో అఖిల భారత ఐక్య రైతు సంఘం(మాస్‌లైన్ అనుబంధ) జాతీయ మహాసభల్లో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. కనీస మద్దతు ధర, ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు పోరాటాలు చేయాలన్నారు. అప్పుల బాధతో రోజుకు సగటున 48 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. రైతు సమస్యలను విస్మరించిన మోదీ సర్కార్ కార్పొరేట్‌లకు మాత్రం రూ. 16 లక్షల కోట్ల రుణం మాఫీ చేసిందని విమర్శించారు. బ్యాంకులకు రూ. 80 వేల కోట్లు ఎగవేసినవారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. మద్దతు ధరలు అడిగిన రైతును అణిచి వేస్తోందని, మతం పేరుతో విభజించు పాలించు పద్ధతి అవలంబిస్తోందని ఆరోపించారు. 2029లో అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజాస్వామ్యం సిగ్గుతో తలవంచక తప్పదని అన్నారు. దేశంలో మోదీ ఫాసిస్టు పాలన సాగుతోందని, రానున్న కాలంలో లౌకిక, ప్రజాస్వామికవాదులు ఏకమై మోదీ ఫాసిస్టు ప్రభుత్వాన్ని ఓడించాలని అన్నారు. మహాసభల ప్రారంభానికి ముందు మాస్‌లైన్ కార్యాలయం ఎల్లన్న విజ్ఞాన కేంద్రం వద్ద ఏఐయూకేఎస్ జెండాను ఆ సంఘం జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ ఆవిష్కరించారు. మహాసభలకు జాతీయ కన్వీనర్ కిచ్చెల రంగయ్య అధ్యక్షత వహించగా, రాయల చంద్రశేఖర్, కర్నాటి యాదగిరి నగర్‌లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. బెంగాల్, కర్నాటక, అసోం కళాకారులు ఆటా –పాట, నాటికలను ప్రదర్శించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి ప్రసాద్ తొలిపలుకులు వినిపించారు. నాయకులు విమల్ త్రివేదీ, కృష్ణగగోయ్, ఉమాకాంత్, డీజే పూజార్, పరితోష్, దేవ్‌రావు, గౌస్, శివ చరణ్ సింగ్, వివేక్, నిర్వాణప్ప, రాంచంద్రన్, కేజీ రాంచందర్, శశికాంత్, హర్నీక్ మహిమ్, రామకృష్ణ, మనోహర్‌రాజు, శిరోమణి, కాంపాటి పృథ్వీ, అజ్మీరా భిచ్ఛా, పి రామకృష్ణ, గుమ్మడి నర్సయ్య, రమ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
పాల్వంచరూరల్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కసరత్తు మొదలైంది. ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగుల జాబితాను సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. జలవనరుల శాఖలో నాలుగేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఈఈ అర్జున్‌తో సహా 8 మంది డీఈలు, 22 మంది ఏఈలు బదిలీ కానున్నట్లు సమాచారం. మొత్తం 31 మంది బదిలీ అయ్యే అవకాశం ఉంది. పాల్వంచ టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో రెండు, మూడు సంవత్సరాలకు పైగా విధులు నిర్వహిస్తున్న పాల్వంచ ఎఫ్‌డీఓ కట్టా దామోదర్‌రెడ్డితోపాటు ములకలపల్లి రేంజర్ రవి కిరణ్, 39 మంది బీట్ ఆఫీసర్లు, ఇద్దరు డిప్యూటీ రేంజర్ ఆఫీసర్లు రమాదేవి, రాము, 11 మంది సెక్షన్ ఆఫీసర్లు.. మొత్తం 52 మంది బదిలీపై వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
జలనవరుల శాఖలో 31, అటవీశాఖలో 52 మంది


