సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, కొనుగోళ్లలో జాప్యం, ఇబ్బందులు తలెత్తకుండా ఇకముందు ప్రతీ కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలనిఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అంకిత్ హాజరై మాట్లాడారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచామని, అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతున్నామని, తాత్కాలిక నిల్వ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రానున్న 15 రోజులు అత్యంత కీలకం
రానున్న 15 రోజులు మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లకు అత్యంత కీలకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో జిల్లాలో మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇల్లెందు నియోజకవర్గ పరిధిలో సుమారు 9,300 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న నిల్వలు పేరుకుపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బయ్యారం, ములకలపల్లి, కృష్ణసాగర్, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం, కొత్తగూడెం, బంగారుచెలక ప్రాంతాల్లో నిల్వ సదుపాయాలు ఉన్నాయని, మూడు రోజుల్లో మొక్కజొన్నలను గోదాంలకు తరలించాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్, రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రవాణాలో కాంట్రాక్టర్లు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గోదాం సమస్య తలెత్తితే తాత్కాలికంగా ఫంక్షన్ హాళ్లు, పాఠశాల భవనాలు ఇతర అనుకూల భవనాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యా చందన, ఇతర అధికారులు ప్రేమ్ కుమార్, బాబూరావు, త్రినాథ్ బాబు, నరేందర్ తదిరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


