● కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న ప్రధాని మోదీ ● బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహం తొలగింపు ● మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్
ఇల్లెందు: మిలిటెంట్ పోరాటాలతోనే రైతు సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత ఐక్య రైతు సంఘం(ఏఐయూకేఎస్) జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. సోమవారం నుంచి ఇల్లెందులో ఏఐయూకేఎస్ జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. చీలికలు పేలికలుగా మారిన సీపీఐ(ఎంఎల్)లోని కొన్ని గ్రూపులు కలిసి మాస్‌లైన్‌గా ఆవిర్భవించాయి. ఆ పార్టీ ఆధ్వర్యంలో 16 రాష్ట్రాల్లోని రైతు సంఘాలతో అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘం సభలను ఇల్లెందులో నిర్వహిస్తున్నారు. సభకు పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారులు ఆటపాటలతో అలరించారు. అనంతరం సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్‌సింగ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని రైతుల నడ్డి విరిచేలా ఇతర దేశాల నుంచి వరి, మొక్కజొన్న, పత్తి పంటల ఉత్పత్తుల దిగుమతికి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. గంభీర ఉపన్యాసాలు దంచే మోదీ ట్రంప్ షరతులకు తలొగ్గాడని అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే లెనిన్ విగ్రహం తొలగించిందని విమర్శించారు. మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ఎన్డీ పార్టీ ప్రతిఘటన పోరాటం అంటూ కేడర్‌ను మోసం చేస్తోందని ఆరోపించారు. జీవితాలను ధారబోసిన మావోయిస్టు పార్టీ కూడా ఆచరణ సాధ్యం కానీ విధానంలో పని చేశామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో పీడిత ప్రజలరాజ్యం రావాలంటే అన్నిపార్టీలు ఏకం కావా లని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఎన్నికల హామీ లు అమలు చేయడంలేదన్నారు. రైతులు పడిగాపులు కాస్తున్నా మక్కలు, ధాన్యం కొనే పరిస్థితి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీతా రామ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని, ఇల్లెందుకు నీరు ఇవ్వాలని అన్నారు. నాయకులు విమల్ త్రివేది, తుమ్మలపల్లి ప్రసాద్, రంగయ్య, గుమ్మడి నర్సయ్య, కె.రమ, డీహెచ్ పూజార్, కృష్ణ గగోయ్, చండ్ర అరుణ, ఎం.కృష్ణ, రాము, భిక్షం, రాజు, వెంకన్న పాల్గొన్నారు.


