నీ బంటునయ్యా.. | - | Sakshi
Sakshi News home page

నీ బంటునయ్యా..

May 12 2026 12:26 AM | Updated on May 12 2026 12:26 AM

● భద్రాచలానికి భారీగా తరలివస్తున్న మాలధారులు ● ఏటా అరకొర వసతులతో భక్తులకు తప్పనిపాట్లు ● ఈసారైనా సదుపాయాలు మెరుగుపర్చాలని విన్నపం

రామయ్యా..
నేడు హనుమాన్‌ జయంతి వేడుకలు
● భద్రాచలానికి భారీగా తరలివస్తున్న మాలధారులు ● ఏటా అరకొర వసతులతో భక్తులకు తప్పనిపాట్లు ● ఈసారైనా సదుపాయాలు మెరుగుపర్చాలని విన్నపం

భద్రాచలం: హనుమాన్‌ జయంతి మంగళవారం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హనుమాన్‌ మాలధారులు భద్రాచలం దివ్యక్షేత్రానికి వేలాదిగా తరలిరానున్నారు. 45 రోజులపాటు నియమనిష్టలతో దీక్ష పాటించి శ్రీరామ చంద్రస్వామి పాదాల చెంత ఇరుముడి విరమించనున్నారు. ఏటా అంజన్న మాలధారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు దేవస్థానం వసతులు కల్పించలేకపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంజన్నకు ప్రీతిపాత్రమైన మంగళవారం జయంతి రాగా, ఈసారైనా ఏర్పాట్లు మెరుగపర్చాలని భక్తులు కోరుతున్నారు.

ఏటేటా పెరుగుతున్న మాలధారులు

ఇటీవల కాలంలో మాలధారులు ఇరుముడి విరమణకు భారీ సంఖ్యలో భద్రాచలం తరలివస్తున్నారు. రెండు, మూడు రోజులపాటు స్వామివారిని సుమారు 40 వేల మంది వరకు దర్శించుకుంటారు. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల అనంతరం క్రమేణా హనుమాన్‌ జయంతి కూడా పెద్ద ఉత్సవంగా మారుతోంది. కొండగట్టు అంజన్న ఆలయం తర్వాత భద్రాచలంలోనే హనుమాన్‌ మాలధారులు ఇరుముడిని సమర్పిస్తారు.

భక్తులకు వసతులు కల్పించాలి

మాలధారులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఉపాలయంలో ఇరుముడి విరమణ చేస్తారు. రద్దీ ఉండటంతో ఆలయం కిక్కిరిసిపోతుంది. ఈ క్రమంలో సామూహిక విరమణ, పూజలు నిర్వహిస్తే భక్తులకు కొంతమేర ఇక్కట్లు తగ్గుతాయి. నిర్ణీత రుసుంపై పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే ఆలయానికి ఆదాయం, భక్తులకు ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుంది. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా వస్తున్న మాలధారులకు దారి పొడవునా నీడ, వసతి, అన్నదానం కల్పించాలని కోరుతున్నారు. ముక్కోటి, శ్రీరామనవమి తరహాలో భద్రాచలంలో ఉచితంగా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర, అన్న ప్రసాదాలను స్వచ్ఛంద సంస్థలు అందించేలా రెవెన్యూ, దేవస్థాన, పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తద్వారా భక్తులకు ఆర్థిక భారం తగ్గుతుంది. పార్కు వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం, ఇతర కొన్ని చోట్ల అన్నదానాలు ఏర్పాటు చేస్తున్నా భక్తులందరికీ సరిపోవడంలేదు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఉపాలయంలోని మూలమూర్తులను తొలగించి అంతరాలయ ప్రాంగణంలో ఉంచారు. దీంతో ప్రస్తుతం అంతరాలయంలో ఆర్జిత సేవలు నిలిచిపోయాయి. కేవలం వెండి వాకిలి వద్దనే భక్తులను నియంత్రించి పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగానే ఉండే అవకాశం మాలధారులకు సదుపాయాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.

మాలధారుల సందడి

నేడు హనుమాన్‌ జయంతి కాగా, సోమవారం నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మాలధారులతో రామాలయంలో సందడి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement