చుంచుపల్లి: జనగణనలో కీలకమైన గృహ జాబితా వివరాల సేకరణ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. జిల్లాలో 1,780 మంది సిబ్బందిని అధికారులు నియమించారు. ఇందులో 1,615 మంది ఎన్యుమరేటర్లు, 40 మంది నోడల్ అధికారులు,125 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. ఎన్యుమరేటర్లు జిల్లా వ్యాప్తంగా గృహ జాబితా (హౌస్ లిస్టింగ్) సేకరణ ప్రక్రియ ప్రారంభించారు. సర్వేకు స్థానికంగా ఉండే గ్రామపంచాయతీ కార్యదర్శులతోపాటు ఇతర సిబ్బంది సహకరిస్తున్నారు. రెండు, మూడు రోజులు ఇళ్ల మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టడంతోపాటు నంబర్లను కేటాయించనున్నారు. ఇక గత నెల 26వ తేదీ నుంచి ఈ నెల 10 వరకు స్వీయగణనకు అవకాశం కల్పించగా, పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో స్పందన అంతంత మాత్రమే లభించింది. మొదటి విడత జనగణన జూన్ 9వ తేదీ వరకు కొనసాగనుండగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి డిజిటల్ విధానంలో జనాభాను లెక్కించనున్నారు. జనగణనలో జిల్లాలో సుమారు 3,36,407 కుటుంబాల వివరాలు సేకరించనున్నారు.
జనగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జనగణన సర్వేను అధికారులు సమన్వయంతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజూ సర్వే పూర్తయిన అనంతరం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని చెప్పారు. ఇంటినంబర్, గదుల సంఖ్య, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు, ద్విచక్ర వాహనాలు లేదా కార్ల వివరాలు, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని సేకరి స్తారని తెలిపారు.
జిల్లాలో జనగణనకు శ్రీకారం


