మద్యం మత్తులో ఘర్షణ
బూర్గంపాడు: మద్యం మత్తులో మొదలైన గొడవ హత్యకు దారితీసింది. లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో బిహార్ వాసిని అతని గదిలో ఉండేవారే దారుణంగా హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని నవాడ జిల్లాకు చెందిన కుందన్‌సింగ్(45) కొంతకాలంగా లక్ష్మీపురంలో లారీల కమాన్ కట్టల మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. తనతో పాటు మరో ముగ్గురితో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం రాత్రి అందరూ కలిసి బాగా మద్యం తాగారు. ఈ క్రమంలో మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి బండరాయితో కుందన్‌సింగ్ తలపై రెండు, మూడుసార్లు మోదాడు. తీవ్ర గాయాలు, రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారమందుకున్న ఎస్‌ఐ ప్రసాద్ ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. పాల్వంచ సీఐ సతీశ్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి, నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు..
‘కమ్యూనిటీ కనెక్ట్’లో డీఎస్పీ సతీశ్‌కుమార్
పాల్వంచ: చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పాల్వంచ డీఎస్పీ సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. సోమ వారం పట్టణ పరిధిలోని వనమాకాలనీ, తెలంగాణనగర్, వికాంగులకాలనీ, జయమ్మకాలనీల్లో ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమం నిర్వహించా రు. మూడు గంటల పాటు కాలనీల్లో తిరిగి 300 ఇళ్లల్లో సోదాలు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లులేని 72 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం స్థానికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మట్కా, జూదం, కోడి పందేలు, బెట్టింగ్, గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, కాలనీల్లో కొత్త వ్యక్తులు అద్దెకు వస్తే ఇంటి యజమానులు ఆధార్‌కార్డు, చిరునామాను సేకరించాలని, ఎలాంటి సమాచారం అందించినా వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐ సతీశ్, ఎస్‌ఐలు నాగరాజు, జీవన్, కల్యాణి, సురేశ్, మధుప్రసాద్, ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాలి దుమారం.. ఆగమాగం
అశ్వారావుపేటరూరల్: గాలి దుమారంతోపాటు కొద్దిసేపు వర్షం కురవడంతో అన్నదాతలు ఆందోళనకు గురయ్యారు. సో మవారం మధ్యాహ్నం వరకు అధిక ఎండతో ఇబ్బందులు పడగా, కొద్ది సేపట్లోనే వాతావరణం చల్లబడి గాలి దుమారం బీభత్సం సృష్టించింది. అశ్వారావు పేట, నారాయణపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం రాశులపై అన్నదాతలు పట్టాలు కప్పారు. కాగా, అప్పటికే వర్షానికి స్వల్పంగా ధాన్యం రాశులు తడిచినట్లు రైతులు చెబుతున్నారు. అలాగే గాలి దుమారంతో మండలంలోని మల్లాయిగూడెం – దుబ్బతోగు, మల్లాయిగూడెం – పండువారిగూడెం మార్గాల్లో పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న మల్లాయిగూడెం సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్లపై పడిన వృక్షాలను తొలగించారు.


