సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి స్వీకరించిన కలెక్టర్.. సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం కీలకమని, తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే సమస్యలను పరిష్కరించాలని, మిగిలినవాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
కొన్ని దరఖాస్తుల వివరాలు..
● లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన రైతులు ఆర్‌ఎఫ్‌ఆర్ వ్యవసాయ భూముల్లో ఆయిల్‌పామ్ మొక్కలకు నీరు అందించేందుకు విద్యుత్ సదుపాయం కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. అటవీశాఖ అనుమతులు మంజూరు చేయకపోవడంతో కరెంట్ లైన్ వేయలేకపోతున్నామని, ఆయిల్‌పామ్ మొక్కలు ఎండిపోతున్నాయని తెలిపారు. దరఖాస్తును ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు.
● చుంచుపల్లి మండలం వెంకటేశ్వరకాలనీ జీపీకి చెందిన షేక్ పర్వీన్ నివసిస్తున్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ జాబితాలో పేరు లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా దరఖాస్తును చుంచుపల్లి ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు.
● ఇల్లెందుకు చెందిన శేషుకుమారి ప్రమాదంలో చేయి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారిందని, తనకు, తన తల్లికి ఇల్లు, పెన్షన్ లేవని, ఉపాధి అవకాశాలు కల్పించాలని దరఖాస్తు అందించగా.. దానిని ఇల్లెందు తహసీల్దార్‌కు బదిలీ చేశారు.
● కుటుంబ రేషన్ కార్డు నుంచి తన పేరు తొలగించారని, కొత్త రేషన్ కార్డు కోసం ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పటికీ పెండింగ్‌లో చూపిస్తున్నారని ఇల్లెందు ఆరో వార్డుకు చెందిన మహేశ్ తెలిపారు. కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరగా దరఖాస్తును పౌరసరఫరాల శాఖ అధికారికి బదిలీ చేశారు.
● కొత్తగూడెం గణేశ్‌బస్తీ 54వ డివిజన్‌కు చెందిన ఎండీ గౌస్య ఇంటి ఎదుట ఉన్న వేప చెట్టు కూలిపోవడంతో విద్యుత్ స్తంభం పడిపోయిందని, సమస్య పరిష్కరించాలని కోరగా, దరఖాస్తును విద్యుత్ శాఖ అధికారులకు ఎండార్స్ చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన
జూలూరుపాడు: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం జిల్లాలో విద్యా వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా జూలూరుపాడు మండలంలో కలెక్టర్ పర్యటించి, ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. పడమటనర్సాపురం జీపీ దండుమిట్టతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.2 లక్షల వ్యయంతో చేపట్టనున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులకు, పాపకొల్లు పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకుడుగుంత నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పదో తరగతిలో మండలస్థాయిలో మొదటిస్థానం దక్కించుకున్న విద్యార్థిని పూజితను అభినందించారు. జూలూరుపాడు కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం, జూనియర్ కళాశాలలో వేసవి శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. డీఈఓ బి.నాగలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ అజయ్, ఎంఈఓ జుంకీలాల్, ఎంపీఓ తులసీరామ్ పాల్గొన్నారు.


