రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

దుమ్ముగూడెం: మండలంలోని పైడిగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన మడకం దస్రు, మండలంలోని కొత్తూరుకు చెందిన గొంది నాగలక్ష్మి ద్విచక్రవాహనంపై పైడిగూడెం వెళ్లి వస్తూ.. ఓ ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడినవారిని ములకపాడు వైద్యశాలకు అక్కడి నుంచి భద్రాచలం వైద్యశాలకు తరలించగా.. చికిత్సపొందుతూ దస్రు మృతిచెందాడు.దస్రు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారంఇవ్వకుండా మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌ తరలించారు.

కామేపల్లిలో ఒకరు..

కామేపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ములకలపల్లికి చెందిన సత్తి గోపి ఇల్లెందులో పాత ఇనుప సామగ్రి లోడ్‌ చేసేందుకు అదేగ్రామానికి చెందిన పోతురాజు వెంకన్న (58), జక్కుల లింగయ్య, బయ్య వీరస్వామిని డీసీఎం వ్యాన్‌లో తీసుకొస్తున్నాడు. ఈ క్రమాన వ్యాన్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన గోపి కొత్తలింగాల శివారులో ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో క్యాబిన్‌లో ఉన్న వెంకన్న, లింగయ్య, వీరస్వామి ఎగిరిపడి రోడ్డుపై పడగా గాయలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ పోతురాజు వెంకన్న మృతి చెందాడు.ఘటనపై ఆయన భార్య లక్ష్మికాంత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

హైవేపై ప్రమాదంలో..

వేంసూరు: వేంసూరు సమీపాన గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హైవేపై ద్విచక్ర వాహనాల రాకపోకలకు అనుమతి లేకున్నా బులుపూరి అచ్యుతరావు(26), అరవింద్‌, ప్రణీత్‌ వెళ్తున్నారు. ఇందులో అరవింద్‌ బైక్‌ నడిపిస్తుండగా అచ్యుతరావు మధ్యలో, ప్రణీత్‌ వెనుక కూర్చున్నారు. వీరు శనివారం అర్ధరాత్రి వైరా వద్ద టోల్‌ప్లాజాను తప్పించుకుని హైవేపైకి చేరారు. ఈమేరకు కాకినాడకు వెళ్తుండగా వేంసూరు వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో అచ్యుతరావు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసినట్లు వేంసూరు పోలీసులు తెలిపారు.

తొమ్మిది మందికి గాయాలు

అశ్వాపురం: మండలంలోని జగ్గారం వద్ద మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై ఆదివా రం జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మణుగూరు డిపోకు చెందిన ఆర్‌టీసీ బస్సు ప్రయాణికులతో మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తోంది. ముందు ఓ ట్రావెల్స్‌ బస్సు వెళ్తోంది. జగ్గారం వద్ద ట్రావెల్స్‌ బస్సుడ్రైవర్‌.. మరో బస్సును తప్పించబోయి సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక వస్తున్న ఆర్‌టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సులోని తొమ్మిది మంది ప్రయాణికులకు గాయాలవగా వారిని మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అందులో బస్సు కండక్టర్‌ నిర్మల, మరో మహిళ వసంతకు తీవ్ర గాయాలయ్యాయి. ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇద్దరిపై కేసు

ఖమ్మంక్రైం: ఖమ్మంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద ట్రాఫిక్‌ సిగ్నల్‌ సమీపాన రీల్‌చేసేందుకు గాను వాహనాలను స్తంభింపచేసిన ఇద్దరిపై కేసు నమోదైంది. ఖమ్మానికి చెందిన చెంచు ఉత్తమ్‌, గోపి సతీశ్‌ ఈ నెల 2వ తేదీన వాహనాలను నిలిపివేసి రీల్స్‌ చేశారు. ఈ రీల్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో సీపీ కార్యాలయ ఉద్యోగి మురారి శ్రీకాంత్‌ ఖమ్మం టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉత్తమ్‌, గోపి సతీశ్‌పై ఆదివారం న్యూసెన్స్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ వెల్లడించారు.

ఇసుక నిల్వలు సీజ్‌

బూర్గంపాడు: మండల కేంద్రం బూర్గంపాడులోని మైనార్టీ పాఠశాల పక్కన అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను ఆదివారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 25 ట్రక్కుల ఇసుకను నిల్వచేశారనే సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీజ్‌ చేసిన ఇసుకను వేలంపాట నిర్వహించి విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement