వృక్షానికి సుమారు 63 ఏళ్లు
ఉంటాయని చెబుతున్న గ్రామస్తులు
దెబ్బతిన్న ప్రాంగణంలోని షెడ్డు
పాల్వంచరూరల్: పెద్దమ్మగుడి సమీపంలో సంతానం లేని మహిళ భక్తులు ఊయ్యాలతొట్టి కట్టే 63 ఏళ్ల నాటి వృక్షం (రావిచెట్టు) గాలివానకు నేలకూలింది. దీంతో ఆలయ ప్రాంగణంలో రేకులషెడ్ పైన చెట్టుకొమ్మలు పడి దెబ్బతిన్నాయి. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయం వద్ద 1963లో నాటిన వేప, రావిచెట్లు మహావృక్షాలుగా ఎదిగాయి. ఈ రెండు కలిసి ఉన్న చెట్టును అశ్వాత్థామ వృక్షంగా భావించి ఏటా అశ్వత్థామ కల్యాణం నిర్వహిస్తారు. ఈ వృక్షం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేసేందుకు ప్రత్యేక గద్దెను నిర్మించి, దాని చుట్టూ స్టీల్ రెయిలింగ్‌ను నిర్మించారు. శనివారం రాత్రి భారీగా గాలివానకు వృక్షం నేలకూలింది. వేపచెట్టు అలాగే ఉంది. చెట్టు కొమ్మలు పడటంతో షెడ్ కొంతభాగం దెబ్బతిన్నది. స్టీల్ రెయిలింగ్ ఒకవైపు విరిగిపోయింది. రాత్రి కూలిపోడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అదే పగలు అయితే, పెనుప్రమాదం సంభవించి ఉండేది. ఆదివారం ఉదయం చెట్టుకొమ్మలను సిబ్బంది తొలగించారు.
గాలివాన బీభత్సం
పాల్వంచ/పాల్వంచరూరల్: శనివారం రాత్రి పట్టణంలోని కాంట్రాక్టర్స్‌కాలనీ, హమాలీకాలనీ, రాంనగర్, పేటచెరువు, శేఖరం బంజరతోపాటు మండలంలోని జగన్నాథపురం, తోగ్గూడెం, నాగారం, పాండురంగాపురం, రంగాపురం, నాగారం, సూరారం, గ్రామాల పరిధిలో భారీ చెట్లు నేలకూలాయి. 23 విద్యుత్ స్తంభాలు కూలి పోగా విద్యుత్‌వైర్లు తెగిపోవడంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న రూరల్ ఏఈ రవీందర్ సిబ్బంది సహకారంతో కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తోగ్గూడెంలో పలు నివాసాలపై చెట్లు కూలగా ఇండ్లు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం వర్షానికి స్వల్పంగా తడిసిపోయింది. మామిడి కాయలు రాలిపోయాయి.


