అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

May 11 2026 8:38 AM | Updated on May 11 2026 8:38 AM

పాల్వంచ: మూడు రోజుల కిందట ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని నవభారత్‌ గాంధీనగర్‌కు చెందిన జట్‌పట్‌ ఎల్లయ్య (55)కు, తన భార్య లక్ష్మికి 25 ఏళ్ల కిందట విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటూ.. మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం అతను ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు గుర్తించి శ్రీనివాసబంజారా కాలనీలో ఉంటున్న చెల్లెలు మహాలక్ష్మికి సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా మూడు రోజుల క్రితమే చనిపోయి ఉండవచ్చని నిర్ధారించుకున్నారు. అతను గుండెపోటుతో మరణించాడా, లేక మరేదైనా కారణం ఉందా? అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నాగరాజు కేసు నమోద్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి ఆత్మహత్య

ఇల్లెందురూరల్‌: పట్టణంలోని సత్యనారాయణపురానికి చెందిన రమణారెడ్డి (50) ఆదివారం పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. దివ్యాంగుడైన రమణారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడం, భార్య, పిల్లలు లేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు సీఐ సురేశ్‌ తెలిపారు.

అశ్వారావుపేటలో..

అశ్వారావుపేటరూరల్‌: ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఎస్‌ఐ అఖిల కథనం ప్రకారం.. అశ్వారావు పేట మున్సిపాలిటీ పరిధిలోని ఫైర్‌కాలనీకి చెందిన భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి (రెడ్డిబాబు) (52) కొన్నేళ్లుగా హైదారాబాద్‌లో సంస్థలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసవడంతో కుటుంబీకులు మందలించారు. వారంరోజుల క్రితం ఫైర్‌కాలనీలో స్వగృహానికి వచ్చాడు. శనివా రం రాత్రి తన కుమారుడు సతీశ్‌రెడ్డికి ఫోన్‌ చేసి తాను చనిపోతానని చెప్పడంతో వారు చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇంట్లో టీవీ చూస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం జరిపించారు. మృతుడి కి భార్య లక్ష్మి, కుమారుడు ఉన్నారు. మృతుడి కుమారుడు సతీశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

బాలిక అదృశ్యం

చండ్రుగొండ: మండలంలోని బెండాలపాడు శివారు ఎర్రబోడుకు చెందిన బాలిక (17) కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుకుమా జిల్లాకు చెందిన బాలిక బెండాలపాడు శివారులోని ఎర్రబోడులో ఉండే మేనమామ వద్దకు ఆరు నెలల కిందట వచ్చింది. ఇక్కడే ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. ఈ నెల 4వ తేదీన తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తానని చెప్పి వెళ్లింది. కానీ, ఇప్పటివరకు బాలిక తల్లిదండ్రుల వద్దకు చేరకపోగా తిరిగి ఇక్కడకు రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement