పెద్దమ్మతల్లికి విశేషపూజలు | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి విశేషపూజలు

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

పాల్వంచరూరల్‌: పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. ఆదివారం మండల పరిధిలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్‌ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

నేటి నుంచి

విద్యా వారోత్సవాలు

కొత్తగూడెంఅర్బన్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం నుంచి విద్యావారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మొదటి రోజు పీఎం శ్రీ, కేజీబీవీ పాఠశాలల్లో సమ్మర్‌ క్యాంపుల నిర్వహణ, ఇంటర్మీడియట్‌ రెమిడియల్‌ క్యాంపులు, పాఠశాల విద్యపై సర్పంచ్‌లకు వర్క్‌షాపు, జయశంకర్‌ బడిబాట, లైబ్రెరీ డే, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ సాంస్కృతిక దినోత్సవం, చివరి రోజు విద్యా దినోత్సవం నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమాల విజయవంతానికి నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించినట్లు తెలిపారు.

నేటి నుంచి ఏఐయూకేఎస్‌ జాతీయ మహాసభలు

ఇల్లెందు: ఏఐయూకేఎస్‌ జాతీయ ప్రథమ మహాసభలు 11, 12, 13 తేదీలలో ఇల్లెందులో నిర్వహిస్తున్నట్లు సంఘం జాతీయ కన్వీనర్‌ రంగయ్య తెలిపారు. ఆదివారం ఇల్లెందులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాసభలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని వెల్లడించారు. మొదటి రోజు సాయంత్రం ఇల్లెందు జేకే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పాలకుల తీరు వల్లే నేడు వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుపోయిందని ఆరోపించారు. పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలులో పాలకులు విఫలమవుతున్నారని అన్నారు. మహాసభల్లో రైతుల సమస్యలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు.

జాతీయ మహాసభలను

జయప్రదం చేయాలి

రుద్రంపూర్‌: ఈ నెల 11 నుంచి ఇల్లెందులో నిర్వహించే అఖిల భారత ఐక్య రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ కొత్తగూడెం డివిజన్‌ కార్యదర్శి జాటోత్‌ కృష్ణ కోరారు. ఆదివారం చుంచుపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడారు. నాయకులు పి.సతీష్‌, ఎం.రాజశేఖర్‌, చుక్కయ్య, అడమా, సందీప్‌, చంటి, మంగయ్య తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు అంజన్నకు రామయ్య పట్టు వస్త్రాలు..

భద్రాచలంటౌన్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి వారికి భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం తరఫున ఆదివారం పట్టు వస్త్రాలను సమర్పించారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయ ఈఓ కే. దామోదర్‌ రావు, స్థానాచార్యులు కేఈ స్థలశాయి స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement