సెంట్రల్‌ లైటింగ్‌కు మోక్షమేది? | - | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ లైటింగ్‌కు మోక్షమేది?

May 11 2026 8:32 AM | Updated on May 11 2026 8:32 AM

భద్రాచలంలో రెండు ప్రభుత్వాల హయాంలో శంకుస్థాపన

ఆ తర్వాత పట్టించుకోని మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ ఏర్పాటు కూడా అడుగు ముందుకు పడనివైనం

భద్రాచలం: దక్షిణ అయోధ్యగా గుర్తింపు, నాలుగు రాష్ట్రాల ప్రజలకు కూడలి, సుమారు లక్ష మంది జనాభా కలిగిన భద్రాచలం సెంట్రల్‌ లైటింగ్‌కు నోచుకోవడంలేదు. ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. పట్టణంలో బ్రిడ్జి నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు సుమారు అర కిలోమీటర్‌ మేర సెంటల్ర్‌ లైటింగ్‌ ఉంది. అక్కడి నుంచి చర్ల రోడ్డులో తెలంగాణ శివారు ప్రాంతమైన రాజుపేట వరకు, కూనవరం రోడ్డులో ప్రస్తుతం కరకట్ట నిర్మాణం వరకు సెంట్రల్‌ లైటింగ్‌ నిర్మించాల్సి ఉంది. చర్ల రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రూ. రెండు కోట్లు ప్రకటించారు. పనులకు ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే రోజు 2023, సెప్టెంబర్‌ 9న ఉదయం నాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగా, పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత అదే సెంట్రల్‌ లైటింగ్‌ పనులకు 2025, జూలై 7న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి శంకుస్థాపన చేశారు. ఇలా ఇద్దరు మంత్రులు రెండు ప్రభుత్వాల్లో శంకుస్థాపనలు చేసినా పనులు మాత్రం చేపట్టలేదు. అంబేద్కర్‌ సెంటర్‌లో పక్కపక్కనే ఉన్న రెండు శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయి.

మరింతగా పొడిగిస్తే..

గతంలో అంబేద్కర్‌ సెంటర్‌ నుంచి చర్ల రోడ్డు వైపు 800 మీటర్ల మేర టెండర్‌ ఖరారు చేశారు. సెంట్రల్‌ లైటింగ్‌ను, డివైడర్లను మరింత దూరం పొడిగించాలని, కూనవరం రోడ్డులో ప్రస్తుతం నిర్మిస్తున్న కరకట్ట ప్రాంతం వరకు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటోంది. డివైడర్‌ పొడిగిస్తే రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఐటీడీఏ రోడ్డులో పురుషోత్తపట్నం శివారు ప్రాంతం వరకు రోడ్డును విస్తరించి డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణమెప్పుడో..?

ఎన్నికల హామీ మేరకు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభించలేదు. భద్రాచలం నియోజకవర్గంలో 169 పనులకు గాను రూ.14.50 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ ఫండ్‌ ద్వారా విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు అభివృద్ధి పనుల వేగవంతానికి భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని నాటి ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె.రామకృష్ణారావు ఆదేశించారు. ఇందులో భద్రాచలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ. 2 కోట్లు, చర్ల మండలంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ.50 లక్షలు, వెంకటాపురం మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు రూ.50 లక్షలను ప్రకటించారు. వీటిపై అడపాదడపా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి విన్నవిస్తున్నా పనులు మాత్రం ప్రారంభమే కాలేదు. ఇప్పటికై నా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని భద్రాచలంవాసులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement