1,780 మందితో సర్వే
● జనగణన సర్వేకు వేళాయె.. ● మొదటి మూడు రోజులు బ్లాక్‌ల్లో కుటుంబాల గుర్తింపు ● జిల్లాలో విధులు నిర్వర్తించనున్న 1,780 మంది సిబ్బంది ● పర్యవేక్షణకు సూపర్‌వైజర్లు, నోడల్ ఆఫీసర్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో జనగణనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రెండు దశల్లో గణన చేపట్టనుండగా. తొలిదశ సోమవారం మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో 200 నుంచి 250 ఇళ్లను కలుపుతూ బ్లాక్‌లుగా గుర్తించి మ్యాపింగ్ పూర్తిచేశారు. సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించనున్నారు. గతంలో మాదిరి మాన్యువల్‌గా కాకుండా ఈసారి వివరాలన్నీ ఆన్‌లైన్‌లోనే నమోదు చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్‌ఎల్‌ఓ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారానే ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే శిక్షణ పొందిన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లు తొలి మూడు రోజులు హౌస్ లిస్టింగ్ బ్లాక్‌లను పరిశీలించనున్నారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్‌లో ఉన్న కుటుంబాల సంఖ్య, వివరాలను నమోదు చేసుకుంటారు.
స్వీయగణన
జనగణనలో ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం స్వీయగణనకు అవకాశం కల్పించింది. ఈమేరకు వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురాగా.. ఆదివారం రాత్రి 11–59 గంటలకు గడువు ముగిసింది. ఇప్పటికే పలు కుటుంబాలు స్వీయ గణన చేసుకున్నాయి.
ప్రత్యేక యాప్
జనగణన వివరాల నమోదు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా హెచ్‌ఎల్‌ఓ సెన్సెస్–2027 పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌లో ఎన్యుమరేటర్లు తాము సర్వే చేసిన కుటుంబ వివరాలన్నీ నమోదు చేయాలి. ఆదివారం అర్ధరాత్రి 11–59 గంటల తర్వాత ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చే ఈ యాప్‌ను సోమవారం ఉదయం ఎన్యుమరేటర్లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకుంటే తొలగించి మళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆతర్వాత ఎన్యుమరేటర్‌కు కేటాయించిన ఐడీతో పాస్‌వర్డ్ రూపొందించుకుని వివరాల నమోదు ఆరంభించాల్సి ఉంటుంది.
ఎండల దృష్ట్యా జాగ్రత్తలు
తీవ్రమైన ఎండల నేపథ్యాన సర్వే ఉదయాన్నే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించనున్నారు. ఎక్కడైనా సిబ్బంది అస్వస్థతకు గురైనా, ఎవరైనా గైర్హాజరైనా ఆ ప్రాంతంలో సర్వే నిలిచిపోకుండా రిజర్వ్‌గా ఉన్న ఎన్యుమరేటర్లను కేటాయించేలా మానిటరింగ్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటారు.
జిల్లాలో జనగణనకు సంబంధించి ఇప్పటికే బ్లాక్‌లను ఏర్పాటు చేయగా, సర్వే కోసం 1,780 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 40 మంది నోడల్ అధికారులు కాగా, 1,615 మంది వరకు ఎన్యుమరేట్లర్లు, మరో 125 మంది సూపర్‌వైజర్లు ఉన్నారు. ప్రతీ ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ నియమించారు. తొలి దశలో 31 ప్రశ్నలకు ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారు. ఎన్యుమరేటర్ వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరు ఉన్నా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఈ సర్వే వచ్చే నెల 9వ తేదీ వరకు జరగనుండగా, రెండో దశ 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.


