‘లాడ్జీలు’ నిబంధనలు ఉల్లంఘించొద్దు.. | - | Sakshi
Sakshi News home page

‘లాడ్జీలు’ నిబంధనలు ఉల్లంఘించొద్దు..

May 10 2026 7:52 AM | Updated on May 10 2026 7:52 AM

ఎస్పీ రోహిత్‌రాజు హెచ్చరిక

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో లాడ్జీల యజమానులు నేరాలు నియంత్రించడంలో సహకరించాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కొత్తగూడెం ఐఎంఏ ఫంక్షన్‌ హాలులో శనివారం లాడ్జీల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పాటించాల్సిన సూచనలు..

ప్రతి అతిథి నుంచి ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డు (ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌) తీసుకోవాలి.

లాడ్జీలో చేరే వారి పేరు, పూర్తి చిరునామా, ఫోన్‌ నంబర్‌, వచ్చిన సమయం, వెళ్లే సమయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాలి. గదుల్లో ఉన్న వారిని కలవడానికి వచ్చే విజిటర్లను నేరుగా లోపలికి పంపకూడదు. రిసెప్షన్‌ వద్ద వారి వివరాలు, ఫోన్‌ నంబర్‌ నమోదు చేసుకోవాలి.

విదేశియులు ఎవరైనా లాడ్జిలోకి వస్తే వారి వివరాలు 24 గంటలలోపు ఆన్‌లైన్‌ ద్వారా (ఫామ్‌–సీ) పోలీసులకు అందించాలి.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రిజిస్టర్‌లోని సమాచారం, గుర్తింపు కార్డుల జిరాక్స్‌ కాపీలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో అందించాలి.

ఎంట్రన్స్‌,రిసెప్షన్‌, కారిడార్‌, బయటవైపు రోడ్డు కనిపించే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజీని కనీసం 30 రోజుల వరకు భద్రపరచాలి.

అనుమానాస్పదంగా అనిపించే లగేజీని తనిఖీ చేయాలి. అధిక మొత్తంలో బ్యాగులు లేదా అనుమానిత వస్తువులు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

అనుమానిత వ్యక్తులు ఎవరైనా ఉన్నా లేదా తప్పుడు వివరాలు ఇస్తున్నారని అనిపించినా, లాడ్జి గదుల్లో మద్యం సేవించడం, జూదం ఆడటం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా. అపరిచిత వ్యక్తులు గ్రూపులుగా వచ్చి బస చేసినా వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు లేదా డయల్‌ 100కు సమాచారం అందించాలి.

స్థానిక పోలీస్‌ స్టేషన్‌, ఎహెచ్‌ఓ నంబర్లను రిసెప్షన్‌ వద్ద అందుబాటులో ఉంచాలి. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నపుడు వారికి సహకరించాలి.

ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించాలి.

రిసెప్షన్‌ డెస్క్‌ కింద అత్యవసర అలారం ఏర్పాటు చేసుకోవాలి. ప్రమాదం లేదా గొడవ జరిగినప్పుడు దాన్ని నొక్కితే పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం వెళ్లేలా ఉండాలి.

సిబ్బంది వివరాలు, పూర్వాపరాలను పోలీస్‌ వెరిఫికేషన్‌ చేయించాలి. సెక్యూరిటీ గార్డులను గుర్తింపు పొందిన ఏజెన్సీకి చెందిన వారిని నియమించాలి.

Advertisement
 
Advertisement
Advertisement